Twitter: మళ్లీ ఖర్చుల కోత.. భారత్‌లో ట్విటర్‌ ఆఫీసులను మూసివేసిన మస్క్‌..!

ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌మస్క్(Elon Musk) మరో ఖర్చు తగ్గింపు చర్య చేపట్టారు. భారత్‌లో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేశారు.  

Updated : 17 Feb 2023 13:30 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను (Twitter) సొంతం చేసుకున్న దగ్గరి నుంచి ఎలాన్‌మస్క్(Elon Musk) తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ సంస్థను గట్టెక్కించడంపైనే దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేసినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని దిల్లీ(Delhi), ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో కార్యాలయాలను మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందులోని సిబ్బందిని ఇంటి నుంచి పనిచేయమని సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే బెంగళూరు(Bengaluru )లోని కార్యాలయంలో మాత్రం సేవలు కొనసాగిస్తున్నట్లు చెప్పాయి. ఇక్కడ ఎక్కువమంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. 

గత అక్టోబర్‌లో మస్క్‌ (Elon Musk) ట్విటర్‌ (Twitter) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆదాయం గణనీయంగా పడిపోయింది. వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడమే అందుకు కారణం. దీంతో ట్విటర్‌ (Twitter)ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్‌ (Elon Musk) అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించారు. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించారు. ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు, వసతులనూ కుదించారు. విలువైన వస్తువులను వేలం వేశారు. ఆ చర్యల్లో భాగంగా.. గత నవంబర్‌లో భారత్‌లో ఉన్న సిబ్బందిలోనే 90 శాతం మందిని తొలగించిన సంగతి తెలిసిందే.  భారత్‌లో ఈ సంస్థకు సుమారు 200 మందికిపైగా ఉద్యోగులు ఉండేవారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని