Elon Musk Twitter: ఎలాన్‌ మస్క్‌తో చర్చలకు సిద్ధమవుతున్న ట్విటర్‌!

ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించి పది రోజులు గడుస్తోంది. ఈలోపు పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. తొలుత ఈ ప్రతిపాదను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.....

Updated : 25 Apr 2022 14:16 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించి పది రోజులు గడుస్తోంది. ఈలోపు పరిణామాలన్నీ వేగంగా మారిపోయాయి. తొలుత ఈ ప్రతిపాదనను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ట్విటర్‌ బోర్డు సైతం తాము కంపెనీని విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చింది. కానీ, మస్క్‌ ఊరుకోలేదు. తాను ఈ విషయంలో ఎంత స్పష్టతతో ఉన్నారో తెలియజేసేలా ఎప్పటికప్పుడు సంకేతాలిస్తూ వచ్చారు. చివరకు లావాదేవీకి కావాల్సిన నిధుల్ని కూడా సిద్ధం చేసుకున్నారు. కొనుగోలు సౌలభ్యం కోసం హోల్డింగ్‌ కంపెనీని సైతం రిజిస్టర్‌ చేయించారు.

మస్క్‌ చర్యలతో ట్విటర్‌ బెట్టువీడక తప్పలేదు. మస్క్‌ డీల్‌కు ఇంకా అంగీకారం తెలపనప్పటికీ.. ఆయన ప్రతిపాదనను మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ‘పాయిజన్‌ పిల్‌’ వ్యూహంతో అడ్డుకట్ట వేయాలనకున్న యత్నాలన్నింటినీ ట్విటర్‌ దాదాపు పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. షేర్‌హోల్డర్లు సైతం ఒత్తిడి తేవడంతో ట్విటర్‌ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఆకర్షణీయంగా ఉంటే మస్క్‌తో ఒప్పందం ఖరారు చేసుకునే దిశగా సిద్ధమవుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. బోర్డుతో పాటు షేర్‌హోల్డర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే మస్క్‌తో చర్చలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మస్క్‌ ఒక్కో ట్విటర్‌ షేరుకు 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్‌ డాలర్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన వివిధ బ్యాంకుల నుంచి 46 బిలియన్‌ డాలర్ల రుణాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ట్విటర్‌ బోర్డుతో సంబంధం లేకుండా టెండర్‌ ఆఫర్‌ ద్వారా ఆయన నేరుగా వాటాదారులతో చర్చలు జరపాలని నిశ్చయించుకొన్నారు. ఈ మేరకు శుక్రవారం పలువురితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ట్విటర్‌ ఎదుగుదలకు వాక్‌ స్వేచ్ఛపై నియంత్రణలు ప్రతిబంధకంగా మారాయని.. వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒకవేళ ట్విటర్‌ బోర్డు ఒప్పుకోకపోయినా.. వాటాదారులంతా దాన్ని అతిక్రమించేందకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ట్విటర్‌ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతూ వస్తోందని మస్క్‌ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను ఆఫర్‌ చేసిన ధర కంటే మంచి విలువను తీసుకురావడం ప్రస్తుత ట్విటర్‌ యాజమాన్యానికి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆదాయం కోసం ప్రకటనలపై ఆధారపడడాన్ని తగ్గించడం, పొడవైన ట్వీట్లను అనుమతించడం, ఎడిట్‌ బటన్‌ సహా పలు మార్పులను మస్క్‌ ఇప్పటికే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింటి తర్వాత కొంతమంది వాటాదారులు మస్క్‌తో సమావేశానికి స్వయంగా ముందుకు వచ్చినట్లు సమాచారం.

పాయిజన్‌ పిల్‌ వ్యూహంతో కంపెనీ 15 శాతానికి మించి వాటాల్ని సొంతం చేసుకోకుండా వేసిన ఎత్తుగడపైనే మస్క్‌ ఇప్పుడు దృష్టిసారించినట్లు సమాచారం. చట్టప్రకారం ఇది తనకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని