Twitter: ట్విటర్‌ ఖాతాలకు ‘అధికారిక’ ట్యాగ్‌.. గంటల్లోనే వెనక్కి తీసుకున్న మస్క్‌

ట్విటర్‌లో బుధవారం సాయంత్రం నుంచి కొన్ని ఖాతాలకు ‘అధికారిక’ అనే గుర్తింపును జత చేశారు. అయితే ఈ ఫీచర్‌తో గందరగోళం తలెత్తడంతో కొద్ది గంటల్లోనే మస్క్‌ దాన్ని వెనక్కి తీసుకున్నారు.

Published : 10 Nov 2022 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ను కొనుగోలు చేసిన అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇప్పటికే ఈ మాధ్యమంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విటర్‌ ఖాతాల బ్లూ టిక్‌ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేస్తామని వెల్లడించారు. అయితే దీని వల్ల నకిలీ ఖాతాలు కూడా బ్లూ టిక్‌ను పొందే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్విటర్‌ ‘అధికారిక (Official)’ ట్యాగ్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారిక ఖాతాలు, ప్రముఖ వ్యాపార ప్రొఫైళ్లకు ఈ ట్యాగ్‌ను జత చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

అన్నట్లుగానే బుధవారం సాయంత్రం నుంచి కొన్ని ఖాతాలకు ఈ ‘అధికారిక’ ట్యాగ్‌ను జత చేశారు. భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పలు మీడియా సంస్థల ఖాతాలకు ఈ ట్యాగ్‌ కన్పించింది. అయితే, వీరితో పాటు కొందరు ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాలకు కూడా ఈ బ్యాడ్జ్‌ జత చేయడం గందరగోళానికి దారితీసింది. దీంతో గంటల వ్యవధిలోనే ఈ ఫీచర్‌ను ట్విటర్‌ తొలగించింది.

ఈ మార్పును గుర్తిస్తూ అమెరికన్‌ యూట్యూబర్‌ మార్కస్‌ బ్రౌన్‌లీ ట్వీట్ చేశారు. తొలుత తన ఖాతాకు ‘అధికారిక’ ట్యాగ్‌ వచ్చిందని పేర్కొన్న బ్రౌన్‌లీ.. ఆ తర్వాత అది కన్పించకుండా పోయిందని తెలిపారు. దీనికి ఎలాన్‌ మస్క్‌ కూడా స్పందించారు. ‘‘ఇప్పుడే దాన్ని తొలగించాం’’ అని రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని