Twitter: ఐఫోన్‌లో ‘ట్విటర్‌ బ్లూ’ సబ్‌స్క్రిప్షన్‌కు 11 డాలర్లు?

ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ధరల్ని సవరించే అవకాశం ఉందని సమాచారం. ఐఫోన్‌లో ట్విటర్‌ వాడే వారి నుంచి అధికంగా వసూలు చేయొచ్చని తెలుస్తోంది.

Published : 08 Dec 2022 12:51 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ (Twitter)లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌ (Blue Tick)’ కోసం తీసుకొచ్చిన ప్రీమియం వెర్షన్‌ ‘ట్విటర్‌ బ్లూ (Twitter Blue)’ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను సవరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన బృందంతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌లో ట్విటర్‌ (Twitter) యాప్‌ ద్వారా చెల్లించే వారికి 11 డాలర్లు, వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించే వారి నుంచి 7 డాలర్లు వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ‘ది ఇన్ఫర్మేషన్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌ ధరల మార్పుపై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.

ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లకు చేసే చెల్లింపులపై 30 శాతం రుసుము విధించాలని యాపిల్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐఫోన్‌ ద్వారా ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారి నుంచి అధికంగా వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఛార్జీ ఎనిమిది డాలర్లుగా ఉంది.  ప్రస్తుతానికి ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ సేవలు అందుబాటులో లేవు. ఎలాంటి తనిఖీ ప్రక్రియ లేకుండానే దీన్ని అందుబాటులోకి తీసుకురావడంతో చాలా మంది డబ్బు చెల్లించి మరీ ఇతర వ్యక్తులు, సంస్థల పేరిట నకిలీ ఖాతాలు తెరిచారు. దీన్ని అరికట్టడానికి కొన్ని మార్పులు చేయాలని ఎలాన్‌ మస్క్‌ నిర్ణయించారు. అప్పటి వరకు సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియను నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారనే అంశాన్ని ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.

మరోవైపు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల యాపిల్‌పై పలు ఫిర్యాదులను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌-యాప్‌ చెల్లింపులపై 30 శాతం రుసుము విధించాలనే నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ దశలో యాపిల్‌తో పోరుకే సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. కానీ, కొన్ని రోజుల్లోనే యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌తో భేటీ అయిన అనంతరం వివాదం సద్దుమణిగినట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని