Twitter: ఇకపై ట్విటర్‌ బ్లూటిక్‌కు డబ్బులు చెల్లించాల్సిందేనా?

బ్లూ టిక్‌ సహా అదనపు ఫీచర్ల కోసం ట్విటర్‌లో ప్రత్యేక పెయిడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో మస్క్‌ ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రస్తుతం వసూలు చేస్తున్న 4.99 డాలర్ల ఫీజును 20 డాలర్ల వరకు పెంచొచ్చని తెలుస్తోంది.

Updated : 31 Oct 2022 12:58 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ను ఇటీవలే సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ట్విటర్‌ పెయిడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు నెలవారీ బ్లూ టిక్‌ సహా అదనపు ఫీచర్ల సబ్‌స్క్రిప్షన్‌ ధరను 19.99 డాలర్లకు పెంచాలని ఉద్యోగులను మస్క్‌ ఆదేశించినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ ‘ది వెర్జ్‌’ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

ప్రస్తుతం 4.99 డాలర్లు చెల్లిస్తే ‘ట్విటర్‌ బ్లూ’ పేరిట బ్లూటిక్‌ సహా అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. ప్రకటనలు లేని ఆర్టికల్స్‌, ప్రత్యేక రంగుతో ఉండే హోంస్క్రీన్‌ ఐకాన్‌ ఈ ప్యాక్‌లో భాగంగా ఉంటాయి. ఇకపై ఈ సేవలకు 19.99 డాలర్లు వసూలు చేయాలని మస్క్‌ ఆదేశించినట్లు సమాచారం. దీంట్లో పెయిడ్ వెరిఫికేషన్‌ను కూడా జత చేసి బ్లూ టిక్‌ బ్యాడ్జ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం బ్లూటిక్‌ మాత్రమే కావాలనుకునేవారికి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. కానీ, తాజాగా బ్లూటిక్‌ను పెయిడ్‌ వెర్షన్‌లో భాగం చేయనుండడంతో ‘బ్లూ టిక్‌’ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ అనుసరిస్తున్న వెరిఫికేషన్‌ ప్రక్రియను పునఃసమీక్షిస్తున్నట్లు ఆదివారం మస్క్‌ ట్వీట్‌ చేయడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. కంపెనీ ఆదాయంలో సగం ఈ సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే సమకూర్చుకోవాలని మస్క్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నవంబరు 7 కల్లా దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తిచేయాలని ఉద్యోగులను మస్క్‌ ఆదేశించినట్లు వెర్జ్‌ తన కథనంలో పేర్కొంది. లేదంటే వారిని తొలగిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని మేనేజర్లను మస్క్‌ ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 50 శాతం సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని