Twitter Vs Apple: ట్విటర్‌ Vs యాపిల్‌.. పోరుకు సిద్ధమైన మస్క్‌!

ట్విటర్‌లో అనేక మార్పులు చేస్తున్న మస్క్‌ తాజాగా టెక్‌ దిగ్గజం యాపిల్‌తో పోరుకు సిద్ధమయ్యారు. ట్విటర్‌కు ప్రకటనల ద్వారా అత్యధిక ఆదాయం యాపిల్‌ నుంచే సమకూరుతోంది. 

Updated : 29 Nov 2022 12:19 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter)ను మస్క్‌ (Elon Musk) హస్తగతం చేసుకొని నెల గడిచింది. ఈ 30 రోజుల్లో కంపెనీలో చాలా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మస్క్‌ (Elon Musk) ఏకంగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple)తో పోరుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మస్క్‌ పెద్ద సాహసమే చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.

ట్విటర్‌ (Twitter)లో యాపిల్‌ (Apple) తమ ప్రకటనల్ని నిలిపివేసిందని మస్క్‌ (Elon Musk) సోమవారం ట్వీట్‌ చేశారు. అలాగే తమ యాప్‌ స్టోర్‌ నుంచి ట్విటర్‌ (Twitter)ను తొలగిస్తామని కూడా యాపిల్‌ బెదిరిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈ దాడి తన మరో కంపెనీ అయిన టెస్లాపై కూడా కొనసాగుతుందా అని యాపిల్‌ను ప్రశ్నించారు. ఇలా వరుస ట్వీట్లతో యాపిల్‌ (Apple)పై మస్క్‌ ఓ రకంగా యుద్ధాన్నే ప్రారంభించారు. పైగా ‘అసలు ఏం జరుగుతోంది’ అని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ను ప్రశ్నించారు.

ట్విటర్‌కు ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో యాపిల్‌ (Apple)దే సింహభాగం. ఈ నేపథ్యంలో ఈ సామాజిక మాధ్యమం మనుగడకు యాపిల్‌ చాలా కీలకం. గతకొన్నేళ్లుగా యాపిల్‌ ట్విటర్‌కు ప్రకటనలు ఇస్తూ వస్తోంది. ట్విటర్‌ కంపెనీతో సంప్రదింపులు, సంబంధాల నిర్వహణ కోసం యాపిల్‌ ఏకంగా ఓ బృందాన్నే నియమించింది. ట్విటర్‌లో ప్రకటనల కోసం యాపిల్‌ ఏకంగా ఏటా దాదాపు 100 మిలియన్‌ డాలర్లపైనే ఖర్చు చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

మస్క్‌ (Elon Musk) ప్రవేశంతో ట్విటర్‌లో రిస్క్‌ ప్రారంభమైందని.. యాపిల్‌ అలాంటి సాహసాలను తీసుకోవడానికి సిద్ధంగా లేదని ప్రముఖ మార్కెటింగ్‌ రంగ నిపుణులు లూ పాస్కలిస్‌ తెలిపారు. ట్విటర్‌ యూజర్లకు యాపిల్‌ ప్రధాన గేట్‌వేగా కూడా ఉంది. యాపిల్‌ యాప్‌స్టోర్‌ ద్వారా దాదాపు 1.5 బిలియన్‌ పరికరాల్లో ట్విటర్‌ను వినియోగిస్తున్నారు. ఒకవేళ ట్విటర్‌ను తమ స్టోర్‌ నుంచి తొలగించాలని యాపిల్‌ నిర్ణయిస్తే అవన్నీ సామాజిక మాధ్యమానికి దూరం కావాల్సి వస్తుంది.

అయితే, వాక్‌స్వేచ్ఛను యాపిల్‌ వ్యతిరేకిస్తోందంటూ మస్క్‌ తాజాగా ప్రచారం మొదలుపెట్టారు. ఫలితంగా తన మద్దతుదారుల నుంచి మరింత మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. తాను వాక్‌స్వేచ్ఛ కోసం పోరాడుతున్నానంటూ మస్క్‌ తన ప్రతిష్ఠను పెంచుకునే ప్రయత్నమూ చేసే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని