Twitter: ‘బ్లూ టిక్‌’కు నెలకు 8 డాలర్లు.. మరిన్ని ప్రయోజనాలూ ఉంటాయ్‌!

Twitter: ట్విటర్‌లో బ్లూటిక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ వచ్చిన ఊహాగానాలను మస్క్‌ నిజం చేశారు. నెలకు 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని ప్రయోజనాలూ ఉంటాయన్నారు.

Updated : 02 Nov 2022 15:04 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ (Twitter)లో కీలక మార్పులకు ఉపక్రమించిన కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ ‘బ్లూ టిక్‌ (Blue Tick)’కు డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధర దేశాన్ని బట్టి మారుతుందని చెప్పారు. ఆయా దేశాల ‘పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ’కి అనుగుణంగా ధరను నిర్ణయిస్తామని తెలిపారు.

డబ్బులు చెల్లించే వారికి బ్లూ టిక్‌ (Blue Tick)తో పాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయని మస్క్‌ (Elon Musk) తెలిపారు. రిప్లై, మెన్షన్‌, సెర్చ్‌ వంటి ఫీచర్లలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. స్పామ్‌ను నివారించడానికి ఈ ఫీచర్లు అవసరమని తెలిపారు. అలాగే ఎక్కువ నిడివి గల వీడియో, ఆడియోను పోస్ట్‌ చేసే వెసులుబాటూ ఉంటుందన్నారు. ప్రకటనలూ సగానికి తగ్గుతాయన్నారు. అలాగే తమతో ఒప్పందం కుదుర్చుకొన్న పబ్లిషర్ల ఆర్టికల్స్‌కు ‘పేవాల్‌ బైపాస్‌’ కూడా ఉంటుందన్నారు. అంటే కొన్ని సంస్థలు అందించే పెయిడ్‌ కంటెంట్‌కు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ట్విటర్‌ (Twitter)లో చదివే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు ప్రముఖుల ట్విటర్‌ (Twitter) ఖాతాలో పేరు కింద సెకండరీ ట్యాగ్‌ ఉంటుందని తెలిపారు. ఇలా సమకూరిన ఆదాయంతో కంటెంట్‌ క్రియేటర్లకు చెల్లించేందుకు ట్విటర్‌కు అవకాశం కలుగుతుందని తెలిపారు.

నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై ట్విటర్‌ (Twitter)లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటికీ మస్క్‌ (Elon Musk) స్పందించారు. ఎంత ఫిర్యాదు చేసినా బ్లూ టిక్ (Blue Tick) కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని గట్టిగా బదులిచ్చారు. పైగా తన ట్విటర్‌ బయోను ‘ట్విటర్‌ కంప్లైంట్‌ హాట్‌లైన్‌ ఆపరేటర్‌’గా మార్చుకోవడం గమనార్హం.

మరికొంతమంది గుడ్‌బై..

ట్విటర్‌ మస్క్‌ (Elon Musk) చేతికి వెళ్లాక.. భవిష్యత్తు ఏంటన్నది అర్థమవడం లేదని పలువురు ఉద్యోగులు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను చూసుకుంటున్నారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సహా మరికొంత మంది ఉన్నతోద్యోగులను మస్క్‌ (Elon Musk) తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరికొంతమంది కీలక వ్యక్తులు కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌, ప్రకటనల విభాగాధిపతి సారా పర్సొనెటె, చీఫ్‌ పీపుల్‌ అండ్‌ డైవర్సిటీ ఆఫీసర్‌ డలానా బ్రాండ్‌, కోర్‌ టెక్‌ జనరల్‌ మేనేజర్‌ నిక్‌ కాల్డ్‌వెల్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ లెస్లీ బెర్లాండ్‌ తాజాగా కంపెనీని వీడిన ప్రముఖుల్లో కొందరని సమాచారం.

పెరుగుతున్న అభ్యంతరకర కంటెంట్‌..

కొనుగోలు ఒప్పందం పూర్తయినప్పటి నుంచి ట్విటర్‌లో విద్వేషపూరిత, అభ్యంతరకర కంటెంట్‌ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంగ్ల అక్షరం ‘ఎన్‌’ తో ప్రారంభమయ్యే అభ్యంతరకర పదాల వాడకం ఇటీవల ట్విటర్‌లో 500 శాతం పెరిగినట్లు ‘నెట్‌వర్క్‌ కంటేజియన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తెలిపింది. ఎన్‌ఏఏసీపీ, ఫ్రీ ప్రెస్‌ సహా దాదాపు 40 ప్రముఖ అడ్వొకసీ సంస్థలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ట్విటర్‌లో అత్యధికంగా ప్రకటనలు ఇస్తున్న తొలి 20 సంస్థలకు బహిరంగ లేఖ రాశాయి. కంటెంట్‌ విషయంలో మస్క్‌ (Elon Musk) రాజీపడితే ప్రకటనల్ని నిలిపివేయాలని కోరాయి. మరోవైపు ట్విటర్‌లో యూజర్ల భద్రత, విశ్వసనీయతపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించే వరకు ప్రకటల్ని ఆపేయాలని మీడియాబ్రాండ్స్‌ తమ క్లయింట్లను కోరింది.

ట్విటర్‌కు టెస్లా ఉద్యోగులు..

ట్విటర్‌లో పనిచేయడానికి ఎలాన్‌ మస్క్‌ తన నేతృత్వంలోని ఇతర కంపెనీల ఉద్యోగులకు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టెస్లా ఆటోపైలట్‌ బృందం నుంచి 50 మంది, బోరింగ్‌ కంపెనీ నుంచి ఇద్దరు, న్యూరాలింక్‌ నుంచి ఒకరు ట్విటర్‌కు వెళ్లినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. వీరిలో చాలా మంది మస్క్‌ నమ్మకస్థులుగా ఉన్నవారేనని తెలిపింది. టెస్లా సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బృందం డైరెక్టర్‌ అశోక్‌ ఎల్లుస్వామి; ఆటోపైలట్‌, టెస్లాబాట్‌ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ మిలన్‌ కోవాక్‌, మరో సీనియర్‌ అధికారి మహా విర్దుహగిరి వంటి వారు ట్విటర్‌కు పనిచేయనున్నట్లు తెలుస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని