Adani Group: రెండు ‘అదానీ’ కంపెనీల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు: ఫిచ్‌

Adani Group: గ్రూప్‌లోని కంపెనీల్లో ఉన్న పాలనాపరమైన లోపాల వల్ల రెండు అదానీ కంపెనీల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు పొంచి ఉందని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.

Published : 29 Mar 2023 15:28 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన రెండు కంపెనీలపై ప్రముఖ రేటింగ్స్‌ ఏజెన్సీ ఫిచ్‌ (Fitch) కీలక నివేదిక విడుదల చేసింది. గ్రూప్‌లోని కంపెనీలు, అనుబంధ సంస్థల్లో పాలనాపరమైన బలహీనతలు ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల అదానీ ట్రాన్స్‌మిషన్‌ (Adani Transmission), అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (Adani Ports & SEZ)ల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు పొంచి ఉందని తెలిపింది.

ఈ కంపెనీల రేటింగ్స్‌ ‘BBB-’లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, ఈ రేటింగ్‌ను ఇక్కడే పరిమితం చేయబోమని స్పష్టం చేసింది. క్రెడిట్‌ క్వాలిటీ మెరుగపడేందుకు దోహదం చేసే ఇతర అంశాల్లో పురోగతి ఉంటే రేటింగ్స్‌లో సానుకూల మార్పు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పోర్ట్స్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలంగా ఉందని తెలిపింది. అదనపు అప్పులపై పరిమితులు, నిర్దిష్ట నిధుల ప్రవాహ వనరుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.

2022 డిసెంబరు ముగిసే నాటికి అదానీ గ్రూప్‌ (Adani Group)లో రేటింగ్‌ పొందిన దేశీయ కంపెనీల రుణాల్లో చాలా వరకు విదేశాల్లోనే ఉన్నాయని.. పైగా అవన్నీ సెక్యూర్డ్‌ రుణాలని ఫిచ్‌ తెలిపింది. వీటిలో ఉన్న యూఎస్‌ డాలర్‌ బాండ్లు 2024 మధ్య నుంచి మెచ్యూర్‌ కానున్నాయని పేర్కొంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి మధ్య వచ్చే నగదు ప్రవాహం వల్ల రేటెడ్‌ సంస్థల ద్రవ్య లభ్యత స్థితి మెరుగుపడుతుందని తెలిపింది.

మార్చి 28న స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌ (Adani Group)లోని నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9 లక్షల కోట్ల కిందకు చేరింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడవుతున్న విషయం తెలిసిందే. అయితే, గత నెల రోజుల వ్యవధిలో నష్టాలు కొంత వరకు పరిమితమయ్యాయి. కానీ, ఏసీసీ, అంబుజా సిమెంట్‌ సంస్థల్ని కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణాలను కంపెనీ సకాలంలో చెల్లించలేదని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీంతో గత రెండు రోజుల్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీనిపై గ్రూప్‌ వివరణ ఇచ్చింది. రుణాలను గడువులోగా చెల్లించామని దీనికి సంబంధించిన వివరాలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల దగ్గర త్రైమాసికం చివరలో అప్‌డేట్‌ అవుతాయని తెలిపింది. దీంతో బుధవారం షేర్లు తిరిగి పుంజుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని