Grammarly Story: ఇంగ్లిషులో అక్షర దోషాలు దిద్ది కోటీశ్వరులయ్యారు!

ఆంగ్లంలో అలాంటి దోషాలను, లోపాలను సవరించాలన్న ఆలోచనతో వచ్చిందే ‘గ్రామర్లీ’ యాప్‌. దీన్ని స్థాపించిన ముగ్గురిలో ఇద్దరు ఇప్పుడు బిలియనీర్లుగా అవతరించారు...

Updated : 09 Feb 2022 14:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం రాసే వాక్యాల్లో అన్వయ లోపాలు, అక్షర దోషాలు ఒక్కోసారి విపరీతార్థాలకు దారి తీస్తాయి. ఎదుటి వ్యక్తులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తాయి. మన మాతృభాషలోనైతే కొంత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కానీ, ఆంగ్లం వంటి ఇతర భాషల్లోనైతే మరీ పట్టుంటే తప్ప దోషరహిత వాక్యాలను నిర్మించలేం. ఇదిలా ఉంటే.. కార్పొరేటు కంపెనీలు, ఉన్నత ఉద్యోగాల్లో మెయిళ్లు పంపడం రోజువారీ పనుల్లో భాగం. మెయిళ్లలో తప్పులు దొర్లితే అర్థమే మారిపోవచ్చు. ఇక అది ఎక్కడికి దారితీస్తుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆంగ్లంలో అలాంటి దోషాలను, లోపాలను సవరించాలన్న ఆలోచనతో వచ్చిందే ‘గ్రామర్లీ’ సాఫ్ట్‌వేర్‌. 

ఆ ముగ్గురి ఆలోచనే..

ఇంగ్లిషు ప్రపంచ భాషగా మారిపోయింది. కొన్ని దేశాల్లో మాత్రమే ఇది మాతృభాష. అయినప్పటికీ.. బ్రిటిషు పాలన పర్యవసానంగా అంతటా అధికార భాషగా చలామణీ అవుతోంది. అయినా, తప్పుల్లేకుండా రాయడంలో మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. యావత్తు ప్రపంచం దోషరహిత ఇంగ్లిషుని రాయాలని మ్యాక్స్ లిట్విన్, అలెక్స్ షెవ్‌చెంకో, డిమిత్రో లైడర్ అనే ముగ్గురు యువకులు తలిచారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే గ్రామర్లీ యాప్‌. వర్క్‌ ఫ్రమ్‌ హోం పని సంస్కృతి పెరిగిన తర్వాత దీనికి మరింత ఆదరణ లభించింది. మెయిళ్లతో సహవాసం చేసే కార్పొరేట్లకు ఇప్పుడు గ్రామర్లీ ఒక సాధనంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!

ఏటా 14 లక్షల పదాలు..

శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గ్రామర్లీ కృత్రిమ మేధ సాయంతో మన రాత నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. 2009లో దీన్ని ప్రారంభించారు. బ్రాడ్‌ హూవర్‌ అనే వెంచర్‌ క్యాపిటలిస్ట్ ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు‌. 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 3 కోట్ల మంది గ్రామర్లీని వినియోగిస్తున్నారు. ఏటా 14 లక్షల పదాలను విశ్లేషిస్తారు. ఆంగ్లం మాతృభాషగా లేని దేశాల్లో దీనికి మంచి ఆదరణ ఉంది. ఇంకా చాలా ప్రాంతాలకు దీన్ని విస్తరించాల్సి ఉందని హూవర్‌ తెలిపారు.

వారివురు కోటీశ్వరులు..

గత ఏడాది నవంబరులో గ్రామర్లీ 200 మిలియన్‌ డాలర్లు సేకరించింది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద యూనికార్న్‌లలో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ విలువ 13 బిలియన్‌ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం పెరిగిన తర్వాత తమ బిజినెస్‌ మరింత ఊపందుకుందని హూవర్‌ వెల్లడించారు. కంపెనీలో ఉన్న వాటాల ద్వారా ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఇద్దరు బిలియనీర్లుగా అవతరించారు. మ్యాక్స్‌, అకెక్స్‌ ఇరువురూ చెరి 2.4 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ద్వారా తెలుస్తోంది. హూవర్‌, లైడర్‌ మాత్రం వారి వాటాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు. కానీ, ఉద్యోగుల బృందంగా తమకు మెజారిటీ వాటా ఉందని పేర్కొన్నారు.  సాధారణంగా ఉక్రెయిన్‌లో కమొడిటీ వ్యాపారం ద్వారా అక్కడి వ్యాపారవేత్తలు భారీగా సంపాదిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఓ టెక్ ఆధారిత యాప్‌ ద్వారా వీరివురు ఆర్జిస్తుండడం విశేషం.

ఆలోచన అక్కడి నుంచి వచ్చింది..

1990లో యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్న సమయంలో మ్యాక్స్‌, అలెక్స్‌ ఒకరికొకరు పరిచమయ్యారు. తర్వాత వారు అమెరికా, కెనడాకు వెళ్లిపోయారు. అక్కడ వారు పనిచేస్తున్న కంపెనీలో ‘ప్లేజరిజం’ (plagiarism - గ్రంథచౌర్యం)ను అరికట్టేందుకు చేస్తున్న పని నుంచే గ్రామర్లీ ఆలోచన పుట్టిందని మ్యాక్స్‌ తెలిపారు. ఇంగ్లిషు మాతృభాష కాని తమకు ఎదురైన సవాళ్ల నుంచే దీన్ని రూపొందించామని వివరించారు. 2014లో బేసిక్‌ ఫీచర్లతో ఉచిత ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత గ్రామర్లీకి ఆదరణ పెరిగిందని తెలిపారు. తర్వాత ఉచిత బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత లోతైన సాయం కావాలంటే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక వర్క్‌ ఫ్రమ్‌ హోం వచ్చిన తర్వాత గ్రామర్లీని ఉపయోగించే వారి సంఖ్య మరింత పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని