Loans: అవ‌స‌ర‌మైన రుణం - అన‌వ‌స‌ర‌మైన రుణం తేడా తెలుసా?

రుణం సంద‌ర్భోచిత‌మైన‌ది, నిర్దిష్ట‌మైన అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లిగేదిగా ఉండాలి.

Updated : 02 Dec 2021 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మ‌న ఆకాంక్ష‌లు సాకారం చేసుకోవ‌డంలో, జీవిత ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో రుణాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. అదే స‌మ‌యంలో కొన్ని అప్పులు అన‌వ‌స‌ర‌మైన ఒత్తిడికి దారి తీసి, ఇబ్బంది పెడతాయి. అందుకే ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకోవాల‌నుకునే వారు అవ‌స‌ర‌మైన రుణం - అన‌వ‌స‌ర‌మైన రుణం మ‌ధ్య తేడాను అర్ధం చేసుకోవ‌డం చాలా ముఖ్యమని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల రుణాలు ఏంటి, వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం!

ఇదీ రుణాల లెక్క...

* విద్య‌ కోసం రుణం తీసుకుంటే దానిని అవసరమైన రుణంగా పరిగణించొచ్చు. ఎందుకంటే ఆ రుణం భ‌విష్య‌త్తులో రాబ‌డినిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. విద్య ద్వారా మంచి భ‌విష్య‌త్తు ఏర్ప‌డుతుంది. 

* ఆరోగ్య బీమా కోసం రుణాలు తీసుకోవ‌డం కూడా అవ‌స‌ర‌మైన రుణం కింద‌కే వ‌స్తుంది. ఊహించ‌ని భ‌విష్య‌త్తు సమస్యలు/ప్ర‌మాదాల నుంచి ఈ బీమా మనల్ని ర‌క్షిస్తుంది.

* ఏదైనా వ్యాపారంలో త‌గినంత అనుభ‌వం ఉంటే.. ఆ వ్యాపారంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి రుణం తీసుకోవ‌డం అవ‌స‌ర రుణం అవుతుంది. అనుభవం ఉంది కాబట్టి... ఈ రుణంతో చేసే వ్యాపారంలో నష్టాల శాతం తక్కువ.

 

* ఖ‌రీదైన ఆటోమొబైల్ (టూ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్‌)ను కొనుగోలు చేయ‌డానికి తీసుకునే రుణాన్ని అన‌వ‌స‌ర రుణంగా పరిగణించొచ్చు. ఈఎమ్ఐ మొత్తం వినియోగ‌దారు నెల‌వారీ ఆదాయం, వార్షిక ఆదాయం కంటే ఎక్కువ‌గా ఉంటే అది అన‌వ‌స‌ర రుణం అవుతుంది. 

* అధిక వ‌డ్డీ రేటు విధించే రుణాన్ని కూడా అన‌వ‌స‌ర రుణం అంటారు. ఈ రుణం.. గ్ర‌హీత‌పై గ‌ణ‌నీయ‌మైన వ‌డ్డీ భారాన్ని మోపుతుంది.

* దీర్ఘ‌కాలిక వృద్ధిని అందించ‌ని రుణమూ అనవసర రుణమే. అలాగే వ్య‌క్తిగ‌త వినియోగం కోసం సేవ‌లు, ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌డానికి డ‌బ్బును అప్పుగా తీసుకుంటే ఈ కోవకే చెందుతుంది. 

* క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎంలో డ‌బ్బును విత్‌ డ్రా చేయడం లాంటివి కూడా అన‌వ‌స‌ర రుణం అని చెప్పొచ్చు. ఈ లావాదేవీలపై క్రెడిట్ కార్డ్ సంస్థ‌లు అధిక వ‌డ్డీలు వ‌సూలు చేస్తాయి. స‌ర్వీస్, క‌స్ట‌మ‌ర్ ఛార్జీలు లాంటివి  వాటికి అదనం. 

ఆఖరిగా... రుణం ఎప్పుడూ నిర్దిష్ట‌మైన అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లిగేదిగా ఉండాలి. ఏదైనా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ముందు, ఆ రుణం వల్ల మనకు లాభం కలుగుతుందా, లేదా అనేది కచ్చితంగా విశ్లేషించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని