Home insurance: కలల ఇంటిని బీమాతో కాపాడుకుందాం..!

వివిధ రకాల ప్రమాదాలను నుంచి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్‌లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మనకు ఏది సరిపోతుందనుకుంటే అది తీసుకుంటే మేలు.

Published : 24 Nov 2022 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కష్టపడి కలల ఇంటిని కట్టుకుంటే సరిపోదు. దాన్ని కాపాడుకోవడమూ మన బాధ్యతే. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు.. ఇవన్నీ మన ఇంటికి ఉన్న పెద్ద ముప్పు. వీటి నుంచి రక్షణ పొందాలంటే బీమా ఉండాల్సిందే. మార్కెట్‌లో అనేక రకాల గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

సమగ్ర పాలసీ: ఈ పాలసీ తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, నివాసితులు.. అన్నింటికీ రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, దొంగతనం.. వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది. అయితే, కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. అలాగే పాలసీ తీసుకునేటప్పటికే ఇంటికి జరిగిన ప్రమాదాలనూ ఈ పాలసీలో పరిగణనలోకి తీసుకోరు. అలాగే ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదు.

హోం కంటెంట్‌ ఇన్సూరెన్స్‌: ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఉదాహరణకు ఆభరణాలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్‌ ధరను బట్టి బీమా మొత్తం చెల్లిస్తారు.

స్ట్రక్చరల్‌ ఇన్సూరెన్స్‌: ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు ఈ బీమాను క్లెయిం చేసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్రదాడుల వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే బీమా అందజేస్తారు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్‌.. ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం అందుతుంది.

టెనెంట్‌ ఇన్సూరెన్స్‌: ఇంట్లో అద్దెకు ఉండేవారు ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. గృహోపకరణాలు, ఆభరణాలు, ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు చివరకు దుస్తులకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

ల్యాండ్‌లార్డ్స్‌ బీమా: ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు ఈ తరహా బీమా తీసుకునే వెసులుబాటు ఉంది. వివిధ కారణాల వల్ల అద్దె ఆదాయం కోల్పోయినట్లయితే ఈ బీమా వర్తిస్తుంది. అలాగే అద్దెకు ఉండేవారి వల్ల ఇంటికి లేదా పరిసరాల్లో ఏదైనా ఆస్తికి నష్టం జరిగినా ఈ బీమాను క్లెయిం చేసుకోవచ్చు. అయితే, ఏయే సందర్భాల్లో బీమా వర్తిస్తుందన్నది కంపెనీ నిబంధనలను అనుసరించి ఉంటుంది.

అగ్నిప్రమాద బీమా: వాతావరణ మార్పులు, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్నిప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్నిప్రమాద బీమాలు ఉన్నాయి.

దొంగతనాల నుంచి రక్షణ: ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్‌ విలువను బట్టి బీమా అందజేస్తారు.

పై వాటిలో ఏ బీమా పాలసీ తీసుకోవాలనుకున్నా.. ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను క్షుణ్నంగా పరిశీలించాలి. అలాగే వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను పోల్చి చూసుకొని ఏది సమగ్రంగా ఉంటే దాన్ని తీసుకోవాలి. అలాగే ఎక్కువ హామీ మొత్తం ఉన్న పాలసీని ఎంచుకునేందుకు ప్రయత్నించాలి. మీ అవసరాలు, ఇల్లు ఉన్న ప్రాంతం, అక్కడి పరిసరాలు, అక్కడి వాతావరణాన్ని బట్టి అనువైన పాలసీని ఎంపిక చేసుకోవాలి. వీలైనంత వరకు సమగ్ర పాలసీ తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు