Term Policy: టర్మ్ పాలసీల్లో ఇన్ని రకాలు ఉన్నాయని మీకు తెలుసా?

Term Policy: ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ స‌ర‌ళమైన, చౌకైన ప్లాన్. పాల‌సీ దారుడు.. పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే  నిర్ణీత హామీ మొత్తాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అందిస్తుంది.

Published : 22 Jun 2022 19:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి తీసుకోవాల్సిన పాల‌సీల‌లో ముఖ్య‌మైన‌ది ట‌ర్మ్ పాల‌సీ (Term Policy). ఇది బీమా కోసం మాత్ర‌మే ఉద్దేశించినది. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. నామినీ/కుటుంబ స‌భ్యుల‌కు హామీ మొత్తం అందుతుంది. ఇలాంటి ట‌ర్మ్ ప్లాన్‌లోనూ వివిధ రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని స‌రిపోయే పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

1. ప్యూర్ ట‌ర్మ్ ప్లాన్‌: జీవిత బీమాలో స‌ర‌ళమైన, చౌకైన ప్లాన్ ఇది. పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో పాల‌సీ దారుడు మ‌ర‌ణిస్తే నిర్ణీత హామీ మొత్తాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అందిస్తుంది. ఒక‌వేళ కాల‌ప‌రిమితి పూర్తయ్యే వ‌ర‌కు పాల‌సీదారుడు జీవించి ఉంటే ఎటువంటి ప్ర‌యోజ‌నం అంద‌దు. అందువ‌ల్లే ఈ ప్లాన్ ప్రీమియం, ఇత‌ర ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్ లాంటి ప్లాన్‌ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గా ఉంటుంది. పాల‌సీ తీసుకునే వ్య‌క్తి వ‌య‌సు, పాల‌సీ వ్య‌వ‌ధి, హామీ మొత్తంపై ప్రీమియం ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ పాలసీలో బీమా హామీ మొత్తం పాలసీ కాలపరిమితికంతటికీ ఒకేవిధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50 ల‌క్ష‌ల‌ బీమా హామీ మొత్తంతో 35 సంవత్సరాల టర్మ్‌ పాలసీ కొనుగోలు చేసినట్లయితే.. ఈ పాలసీ కాలపరిమితి అయిన 35 సంవత్సరాలూ బీమా హామీ మొత్తం మారదు.

2. ప్రీమియం తిరిగి చెల్లించే ట‌ర్మ్‌ పాలసీ: పాలసీ కాలపరిమితి వరకూ బీమా హామీని ఇస్తూ, పాలసీ పూర్తయిన తర్వాత పాలసీదారుడికి ప్రీమియంను తిరిగి చెల్లిస్తుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే, కుటుంబానికి బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. పాలసీదారుడు పాలసీ కాలపరిమితి వరకూ జీవించి ఉన్నట్లయితే.. సదరు పాలసీదారుడికి చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. మిగిలిన టర్మ్ పాలసీల కంటే ఈ పాలసీల ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. టర్మ్ పాలసీ తీసుకోవడాన్ని కేవలం ఖర్చుగా అనుకునేవారు ఈ రకమైన పాలసీని కొంచెం మెరుగైనదిగా భావించవచ్చు. కానీ, అదే హామీ మొత్తానికి ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీని తీసుకుని, అద‌న‌పు ప్రీమియంను ఇత‌ర పెట్టుబ‌డుల్లో పెట్ట‌డం వ‌ల్ల మెరుగైన రాబ‌డిని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

3. ఇంక్రీజింగ్ టర్మ్ పాలసీ: ఈ పాలసీలో పాల‌సీదారుడు వార్షిక ప్రాతిప‌దిక‌న బీమా హామీ మొత్తాన్ని పెంచుకునే అవ‌కాశం ఉంటుంది. ప్రీమియంలో మాత్రం ఎటువంటి మార్పూ ఉండ‌దు. ఈ కార‌ణంగా టర్మ్‌ బీమా పాలసీతో పోలిస్తే ఈ త‌ర‌హా పాల‌సీ ప్రీమియం కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50 ల‌క్ష‌ల‌ బీమా హామీ మొత్తంతో 35 సంవత్సరాలకు 5% ఇంక్రీజింగ్ టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పాలసీదారుడి బీమా హామీ మొత్తం 5 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. అంటే రెండో సంవ‌త్స‌రం పాలసీదారుడి బీమా హామీ మొత్తం రూ.52.5 ల‌క్ష‌లు అవుతుంది, మూడో సంవ‌త్స‌రం పాలసీదారుడి బీమా హామీ మొత్తం రూ.55 ల‌క్ష‌లు.. ఇలా పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కంపెనీని బట్టి గరిష్ఠ పరిమితి ఉండొచ్చు.

కెరియ‌ర్ ప్రారంభ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు జీతం త‌క్కువ‌గా ఉంటుంది. బాధ్యతలు త‌క్కువ‌గానే ఉంటాయి. సంపాద‌న సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి హామీ మొత్తాన్ని నిర్ణ‌యిస్తారు. ఇది అప్ప‌టికి స‌రిపోవ‌చ్చు. కానీ కెరియ‌ర్‌లో ఎదుగుతున్న కొద్దీ సంపాద‌న పెరుగుతూ ఉంటుంది. అలాగే, కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అందుకు తగ్గట్లుగా బీమా హామీ ఉండటం అవ‌స‌రం. ఇంక్రీజింగ్ టర్మ్ పాలసీ కొనుగోలు చేసినట్లయితే సంపాదన సామర్థ్యం పెరుగుదలకు అనుగుణంగా బీమా హామీ మొత్తం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వేరే పాలసీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అందువ‌ల్ల కెరీర్ ప్రారంభదశలో ఉన్నవారికి ఈ రకమైన పాలసీలు అనుకూలంగా ఉంటాయి.

4. డిక్రీజింగ్ టర్మ్ పాలసీ: ఈ పాలసీలో కాలవ్యవధితో పాటు బీమా హామీ మొత్తం తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50 ల‌క్ష‌ల‌ బీమా హామీ మొత్తంతో 20 సంవత్సరాలకు 5% డిక్రీజింగ్ టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పాలసీదారుడి బీమా హామీ మొత్తం 5 శాతం చొప్పున తగ్గుతూ ఉంటుంది. అంటే రెండో సంవ‌త్స‌రం హామీ మొత్తం రూ.47.50 ల‌క్ష‌ల‌కు, మూడో సంవ‌త్స‌రం రూ.45 లక్షలకు.. ఇలా ప్ర‌తి సంవ‌త్స‌రం 5 శాతం, అంటే రూ.2.50 లక్షలు హామీ మొత్తం తగ్గుతుంది. పాలసీ చివరికి హామీ మొత్తం సున్నా అయిపోతుంది.

గృహ రుణం, వ్య‌క్తి గ‌త రుణం.. ఇలా అధిక మొత్తంలో రుణం తీసుకుని వీటి కోసం ట‌ర్మ్ పాల‌సీ తీసుకుని, ప్రతి సంవ‌త్స‌రం ఈఎంఐ చెల్లిస్తుంటే.. రుణ భారం త‌గ్గుతుంది కాబ‌ట్టి అలాంటి వారు ఈ పాల‌సీ ఎంచుకోవ‌చ్చు. అలాగే, కుటుంబ బాధ్యతలైన పిల్లల చదువులు, వివాహం, గృహ, వాహన రుణాలు వంటివి పాలసీ కాలం గడిచే కొద్ది తీరిపోతూ ఉంటాయి. ఆ సమయంలో పెద్దమొత్తంలో బీమా హామీ అవసరం ఉండదు అనుకునే వారు ఇలాంటి పాలసీని ఎంచుకోవచ్చు.

5. కన్వర్టిబుల్ టర్మ్ పాలసీ: టర్మ్ పాలసీగా కొనుగోలు చేసినప్పటికీ, పాలసీ కాలవ్యవధిలో ఎండోమెంట్, మనీబ్యాక్ లేదా ఇతర పాలసీగా మార్చుకునే వీలును కల్పించే టర్మ్ పాలసీయే కన్వర్టిబుల్ టర్మ్ పాలసీ. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 20 ఏళ్ల కాల‌పరిమితితో ట‌ర్మ్ ప్లాన్ తీసుకుని 5 ఏళ్ల త‌ర్వాత ఎండోమెంట్ లేదా హోల్ లైఫ్ పాల‌సీగా మార్చుకోవాల‌నుకుంటే.. ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్లాన్‌ను మార్చుకోవ‌చ్చు. అయితే, నిపుణులు ఇలాంటి పాలసీతో పెద్దగా ఉపయోగం ఉండదని భావిస్తున్నారు.

చివ‌రగా..: జీవితం సాఫీగా సాగాల‌ని అంద‌రూ కోరుకుంటారు. కానీ, అన్నీ అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌వు. నిమిషాల వ్య‌వ‌ధిలోనే జీవితం మారిపోతుంది. అందువ‌ల్ల అన్ని ప‌రిస్థితుల‌కు సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి, తన మీద ఆధారపడిన కుటుంబ స‌భ్యుల కోసం త‌ప్ప‌నిస‌రిగా ట‌ర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలి. కుటుంబంలో ఒక‌రిద్ద‌రికైనా పాలసీ వివరాలను తెలియజేయాలి. అవసరం వచ్చినప్పుడు వాటిని క్లెయిమ్‌ చేసే పద్ధతిని వివరించాలి. పాలసీ డాక్యుమెంట్లన్నీ ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు తెలియ‌ప‌ర‌చాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని