Travel Insurance: ప్రయాణానికి తగిన పాలసీనే ఎంచుకున్నారా?

వివిధ రకాల ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మరి ఎలాంటి వాటిని ఎంచుకోవాలి? ఇప్పుడు చూద్దాం.

Published : 14 Dec 2022 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణాలు మన జీవితంలో అంతర్గత భాగంగా మారాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ఆహ్లాదం, వివిధ ప్రాంతాల సందర్శన, కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదించేందుకు ఇలా రకరకాల కారణాలతో దేశ, విదేశాల్లో ప్రయాణాలు చేస్తుంటాం. ప్రయాణం మొత్తం సాఫీగా సాగితే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదరవుతుంటాయి. ప్రమాదాలు జరగడం, సామాను పోగట్టుకోవడం, వాతావరణం అనుకూలించని కారణంగా విమానాలు, రైళ్లు రద్దు కావడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణబీమా ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది.

అవసరాలకు అనుగుణంగా..

ప్రయాణ బీమా లక్ష్యం.. ప్రయాణ సమయంలో ఆర్థిక భద్రతను కల్పించడమే. ఇందులోనూ రకరకాల బీమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్రయాణ బీమాను ఎంచుకోవాలి. ఎందుకు ట్రావెల్‌ చేస్తున్నారు? ఎంత కాలం ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారు? ఎన్ని రోజుల వ్యవధిలో ప్రయాణిస్తారు? ట్రావెల్‌ చేస్తున్న ప్రదేశం లేదా దేశం, ప్రయాణికుడు, అతడి లేదా ఆమె కుటుంబ సభ్యుల వయసు, ప్రయాణికుల సంఖ్య.. ఇలా వివిధ రకాల ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తులు వారి వారి అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి. 

ప్రయాణ బీమా-రకాలు..

ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ పాలసీ..

విదేశాలకు విహారయాత్రలకు వెళ్లాలని చాలా మంది ప్లాన్‌ చేస్తుంటారు. ఇది కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే విదేశాలకు వెళ్లేటప్పుడు కనెక్టింగ్‌ ఫ్లైట్లు అందుకోలేకపోవడం, ప్రమాదాలు, అనారోగ్యం, బ్యాగేజ్‌ కోల్పోవడం, ఫ్లైట్‌ హైజాక్‌, పాస్‌పోర్ట్‌ లాంటి ట్రావెల్‌ డాక్యుమెంట్లు కోల్పోవడం వంటి ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఇవన్నీ ఈ పాలసీ కవర్‌ చేస్తుంది. అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరితే నగదు రహిత చికిత్సలను చాలా వరకు పాలసీలు అందిస్తున్నాయి. కాబట్టి విదేశాలకు ప్రయాణం చేసేవారు ఈ పాలసీలను ఎంచుకోవడం మంచిది. 

డొమెస్టిక్‌ ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ పాలసీ..

విదేశాలకు వెళ్లే వారికి అంతర్జాతీయ పాలసీ ఏవిధంగా అయితే ప్రయోజనం చేకూర్చుతుందో అదేవిధంగా దేశీయంగా ప్రయాణాలు చేసేవారికి డొమెస్టిక్‌ ట్రావెల్ పాలసీ ప్రయోజనం చేకూర్చుతుంది. ఇది కూడా వైద్య ఖర్చులు, ఫ్లైట్‌/ రైలు ఆసల్యం కావాడం లేదా రద్దు, సామాను కోల్పోవడం వంటి వాటిని కవర్‌ చేస్తుంది. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాలసీలు కవరేజీ అందిస్తాయి. కొంత మంది సొంత వాహనాల్లో కూడా ట్రిప్‌లకు వెళ్తుంటారు. అలాంటప్పుడు కూడా పాలసీ కవరేజీ లభిస్తుంది. 

వ్యక్తిగత ప్రయాణ బీమా..

పేరులో సూచించినట్లుగా, ఈ ప్లాన్‌లు ఒంటరిగా ప్రయాణించే వ్యక్తుల కోసం రూపొందించారు. ఇతర ప్లాన్‌లతో పోలిస్తే, ఇవి చాలా సరసమైనవి. అలాగే, పాలసీదారునికి అవసరమైన అన్ని ప్రయోజనాలను అందిస్తాయి.

ఫ్యామిలీ ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ పాలసీ..

కుటుంబ సభ్యులు అంతా కలసి ప్రయాణాలు చేస్తుంటే ఈ రకమైన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరికీ విడివిడిగా పాలసీలు కొనుగోలు చేయాల్సిన అవసరం అవసరం లేకుండా అందర్నీ ఒకే పాలసీ కిందకి తీసుకొస్తుంది. దీంతో డబ్బును కొంత వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సురెన్స్‌లో చాలా వరకు ప్లాన్లు భార్య-భర్తలతో పాటు 21 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలను కవర్‌ చేస్తుంటాయి. కొన్ని ప్లాన్లు మాత్రం తల్లిదండ్రులను, ఎక్కువ మంది పిల్లలను కూడా కవర్‌ చేస్తాయి. అయితే, ప్రీమియం కాస్త అధికంగా ఉండొచ్చు. 

సీనియర్‌ సిటిజన్‌ ట్రావెల్‌ పాలసీ..

రిటైర్‌మెంట్‌ తర్వాత ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది. ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు దర్శించాలని, విదేశాల్లో తమకు నచ్చిన ప్రదేశాలు చూడాలని సీనియర్‌ సిటిజన్లు ప్లాన్‌ చేస్తుంటారు. అయితే, ప్రయాణ సమయంలో వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో సీనియర్‌ సిటిజన్లు తొందరంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి ప్రయాణ సమయంలో బీమా అవసరం ఎక్కువ. వీరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే సీనియర్‌ సిటిజన్‌ ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ పాలసీలు. సాధారణంగా 61 నుంచి 71 ఏళ్ల వయసు వారికి ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. కొన్ని పాన్లు 91 ఏళ్ల వయసు వారిని కూడా కవర్‌ చేస్తున్నాయి. ఇతర పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియం అధికంగా ఉండొచ్చు.  

స్టూడెంట్‌ ట్రావెల్‌ ఇన్సురెన్స్‌..

విదేశాలకు వెళ్లి చదువుకునే 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న భారతీయ విద్యార్థుల కోసం ఈ ప్రణాళికలు రూపొందించారు. చదువు కోసం వెళ్లిన విద్యార్థులు విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి, ఈ ప్లాన్‌లు సాధారణంగా 1-3 సంవత్సరాల మధ్య ఉంటాయి. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాలవ్యవధిని పొడిగించవచ్చు. ఈ రకమైన పాలసీలు ఇతర పాలసీలతో పోలిస్తే కొన్ని భిన్నమైన ప్రయోజనాలు అందిస్తాయి. స్పాన్సర్ ప్రొటెక్షన్, ల్యాప్‌టాప్ నష్టం, విద్య అంతరాయం వంటి అనేక ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు ఈ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. 

ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ..

ఈ పాలసీ ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లేటప్పుడు ఎదురయ్యే ఆరోగ్య సంబంధిత ప్రమాదాలను కవర్‌ చేస్తుంది. ఈ రకమైన పాలసీ ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఇతర (విద్యలో) అత్యవసర పరిస్థితుల కారణంగా ఉత్పన్నమయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. అయితే, కవరేజీ బీమా సంస్థను అనుసరించి మారుతుంది కాబట్టి ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు కచ్చితమైన ప్రయోజనాలను తెలుసుకోవడం ముఖ్యం.

సింగిల్ & మల్టీ-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ..

ఒక ఏడాదిలో ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ ప్రయాణం చేయని వ్యక్తుల కోసం, సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి. 

ఒక ఏడాదిలో రెండు సార్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి మల్టీ-ట్రిప్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉత్తమం. ఇది 365 రోజుల వరకు లేదా బీమా సంస్థ నిర్దేశించినంత వరకు రక్షణను అందిస్తుంది. ఎక్కువ సార్లు ప్రయాణించేవారు ఇది తీసుకోవడం వల్ల ట్రావెల్‌కు ముందు ప్రతిసారీ బీమా తీసుకునే అవసరం ఉండదు. 

కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ..

దీన్ని వార్షిక-మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు.  వ్యాపార-సంబంధిత కార్యకలాపాల కోసం పరిశ్రమలు, కార్పొరేషన్‌లలో పనిచేస్తున్న వ్యక్తులు తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి, అటువంటి వారు ఎక్కువగా ఈ ప్లాన్‌ ఎంచుకుంటారు. కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి. తరచూ చేసే ప్రయాణాలకు కవరేజీని అందిస్తాయి.

చివరిగా..

మీ ప్రయాణం ఉద్దేశం ఏదైనప్పటికీ, వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా ప్రయాణించేలా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సహాయపడుతుంది. అయితే, పాలసీ తీసుకునే ముందు కవరేజీకి సంబంధించిన అన్ని ముఖ్యవిషయాలు.. బీమా పరిధి, పాలసీదారుడు భరించాల్సిన ఖర్చులు, ఇతర నియమ నిబంధనలు తెలుసుకోవాలి. ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు వివిధ బీమా సంస్థలు అందించే పాలసీలను పోల్చిచూసుకుని మీ అవసరాలకు సరిపోయే పాలసీని ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని