
6G: యూఏఈ చూపు 6జీ వైపు!
దుబాయ్: ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే 5జీ నెట్‌వర్క్‌ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్‌లోనూ 5జీ నెట్‌వర్క్‌ను పరిక్షించేందుకు భారత టెలికాం సంస్థ అనుమతులిచ్చింది. అయినా ప్రజలకు 5జీ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలాకాలమే పట్టేలా ఉంది. కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మాత్రం అప్పుడే 6జీ నెట్‌వర్క్‌పై పరిశోధన మొదలుపెట్టేసింది.
యూఏఈకి చెందిన ఎటిసలాట్ అనే మొబైల్ నెట్‌వర్క్ సంస్థ 6జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇది 5జీ కంటే 100రెట్లు వేగంగా పనిచేయనుందట. బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2021 కార్యక్రమంలో ఎటిసలాట్ సంస్థ ప్రతినిధి హైతమ్ అబ్దులాజక్ ఈ మేరకు ప్రకటించారు. ‘‘6జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావడం కోసం మా సంస్థ పరిశోధన అండ్ అభివృద్ధి విభాగంలో ఉన్న అన్ని పరికరాలను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. సరి కొత్త సేవలకు నాంది పలికేలా 6జీ నెట్‌వర్క్ భూమిని దాటి అంతరిక్షానికి విస్తరిస్తుంది’’అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి ఎప్పుడు తీసుకొస్తారో ఎటిసలాట్ సంస్థ వెల్లడించలేదు. కాగా.. 2028-29 నాటికి 6జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని గతంలో ఓ సంస్థ నివేదికలో పేర్కొంది.