Uber: క్యాబ్‌ ఆలస్యం.. ఉబర్‌కు ₹20 వేల జరిమానా

Uber: సేవలు ఆలస్య అందించినందుకుగానూ ఉబర్‌కు ముంబయి కన్జ్యూమర్‌ కోర్టు రూ.20,000 జరిమానా విధించింది.

Updated : 27 Oct 2022 12:57 IST

ముంబయి: ముంబయికి చెందిన ఓ వినియోగదారుల ఫోరం ఉబర్‌ ఇండియాపై రూ.20 వేల జరిమానా విధించింది. క్యాబ్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తికి ఆలస్యంగా సేవలు అందించిన కారణంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2018లో జరిగిన ఈ ఘటన జరగ్గా.. వినియోగదారుడికి అనుకూలంగా తాజాగా తీర్పు వెలువడింది.

ముంబయికి చెందిన కవితా శర్మ అనే న్యాయవాది 2018 జూన్‌ 12న చెన్నైకి వెళ్లాల్సిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానాశ్రయానికి 36 కి.మీ దూరంలో ఆమె ఇల్లుంది. అక్కడి నుంచి ఆమె మధ్యాహ్నం 3:29 గంటలకు క్యాబ్‌ బుక్‌ చేశారు. కానీ, యాప్‌లో చూపించిన దాని కంటే క్యాబ్‌ 14 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అదీ మధ్యలో పలుసార్లు డ్రైవర్‌కు కాల్‌ చేయాల్సి వచ్చిందని కోర్టుకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రయాణాన్ని మరింత ఆలస్యంగా ప్రారంభించాడని తెలిపారు. ఆపై వేరే మార్గంలో వెళ్లి కొంత సమయం.. సీఎన్‌జీ స్టేషన్‌లో ఆపి మరింత జాప్యం చేశాడని చెప్పారు. దీంతో 15-20 నిమిషాలు ఆలస్యమైందని తెలిపారు. అప్పటికే విమానం వెళ్లిపోయిందన్నారు. దీంతో మరో టికెట్‌ కొనుక్కొని తర్వాతి విమానానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు.

పైగా యాప్‌లో బుక్‌ చేసుకున్న సమయంలో ట్రిప్‌ ఖరీదు రూ.563 చూపించగా.. చివరకు ఉబర్‌ రూ.703 బిల్లు చేసినట్లు కవిత తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. తర్వాత రూ.139 తిరిగి ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. కవిత తొలుత ఉబర్‌ కంపెనీకి న్యాయపరమైన నోటీసులు పంపారు. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆమె ఠాణె జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. అప్పుడు స్పందించిన ఉబర్‌ తాము కేవలం వినియోగదారులు, డ్రైవర్ల మధ్య అనుసంధానం చేసే వేదిక మాత్రమేనని వివరణ ఇచ్చింది. అయితే, యాప్‌ను కంపెనీయే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ వేదికగా జరిగే లావాదేవీలు, సేవలకు బాధ్యత వహించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కోర్టు ఖర్చుల కింద రూ.10,000, మానసికంగా వేదనకు గురి చేసినందుకుగానూ మరో రూ.10,000 చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని