Credit Suisse: క్రెడిట్ సూయిజ్ కొనుగోలుకు యూబీఎస్ చర్చలు..!

క్రెడిట్‌ సూయిజ్‌ను సంక్షోభం నుంచి బయటపడేయడానికి స్విస్‌ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆ సంస్థ వ్యాపారాలను మరో దిగ్గజ బ్యాంకింగ్‌ సంస్థ కొనుగోలు చేసేలా ఓ డీల్‌ను సిద్ధం చేస్తోంది. 

Updated : 18 Mar 2023 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దివాల అంచున కొట్టుమిట్టాడుతున్న స్విస్‌ దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌(Credit Suisse)ను కొనుగోలు చేసేందుకు యూబీఎస్‌(UBS) గ్రూప్‌ ఏజీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) సంస్థ మొత్తాన్ని లేదా.. కొన్ని వ్యాపారాలను కొనుగోలు చేసే  మార్గాలను ఈ గ్రూప్‌ అన్వేషిస్తోంది. స్విస్‌ అధికారుల ప్రోద్బలంతోనే  యూబీఎస్‌ ఈ దిశగా అడుగులు వేస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఓ ఆంగ్ల వార్త సంస్థకు వెల్లడించారు. ఈ వారాంతంలో రెండు బ్యాంకుల బోర్డులు స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌, అక్కడి నియంత్రణ సంస్థ ఫిన్మాతో వేర్వేరుగా భేటీ అయి చర్చలు జరపనున్నాయి.  ఆదివారం సాయంత్రం నాటికి ఈ రెండు బ్యాంకుల మధ్య డీల్‌ ప్రకటించాలనే లక్ష్యంతో ఈ వ్యవహారం ముందుకు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వారం క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) సంస్థ ఆర్థికంగా బలహీనంగా ఉందనే విషయం బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. దీంతో స్విస్‌ ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్‌, ఫిన్మా రంగంలోకి దిగి సంస్థను ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటవేయడానికి యత్నాలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బ్యాంక్‌ స్విస్‌ విభాగాన్ని వేరుచేయడం, యూబీఎస్‌తో డీల్‌ కుదర్చడం వంటి అంశాలపై దృష్టిపెట్టాయి.  

క్రెడిట్‌ సూయిజ్‌లో ప్రధాన వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ అమ్మర్‌ అల్‌ కుదైరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెగ్యులేటరీ ఇబ్బందుల కారణంగా క్రెడిట్‌ సూయిజ్‌లో పెట్టుబడి పెట్టబోమని పేర్కొన్నారు. దీంతో క్రెడిట్‌ సూయిజ్‌ స్టాక్‌ ధర పతనమైంది. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ షేరు 85 శాతం మేర కుంగిపోయింది. ఈ పతనం ఒక్క క్రెడిట్‌ సూయిజ్‌కే పరిమితం కాలేదు. యూరోపియన్‌ మార్కెట్లలో ఇతర బ్యాంకులపైనా పడింది.

 స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి 54 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.43 లక్షల కోట్ల) రుణం పొందడం ద్వారా తమ ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకుంటున్నట్లు  గురువారం క్రెడిట్‌ సూయిజ్‌ వెల్లడించడంతో, బ్యాంక్‌ షేరు 30% మేర పుంజుకొంది. కానీ, నిన్న ఈసీబీ వడ్డీరేట్లను మళ్లీ పెంచడంతో క్రెడిట్‌ సూయిజ్‌ షేరు ధర మరోసారి 10శాతం వరకు పతనమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని