Credit Suisse: క్రెడిట్‌ సూయిజ్‌ పతనానికి ‘యూబీఎస్‌’తో విరుగుడు!

UBS to buy Credit Suisse: బ్యాంకింగ్‌ వ్యవస్థలో మరింత అస్థిరతను నివారించడం కోసం ఈ కీలక ఒప్పందం దోహదం చేస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.

Published : 20 Mar 2023 11:41 IST

జెనీవా: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)ను కొనుగోలు చేసేందుకు ఆ దేశంలోని దిగ్గజ బ్యాంకు యూబీఎస్‌ ముందుకు వచ్చింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ 3.2 బిలియన్‌ డాలర్లు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో వస్తోన్న ఆందోళనలకు తెరపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే ముందుండి..

క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) పతనం ఖాయమనే విషయం ఇటీవలే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దాన్ని రక్షించేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం సహా ఆ దేశ నియంత్రణా సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. అందులో భాగంగా యూబీఎస్‌తో చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఒప్పందం ఖరారయ్యేలా చూశాయి. 166 ఏళ్ల చరిత్ర ఉన్న క్రెడిట్‌ సూయిజ్‌ ఒకప్పుడు స్విట్జర్లాండ్‌ ప్రతిష్ఠకు మకుటంలా నిలిచింది. అలాంటిది గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఇది కేవలం స్విట్జర్లాండ్‌ ఆర్థిక వ్యవస్థకేగాక యావత్‌ ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థను కుదుపులకు లోను చేసే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది.
(ఇదీ చదవండి: నివురుగప్పిన ముప్పు..మరో పెను సంక్షోభాన్ని పొదుగుతున్న అమెరికా..!)

ఒకప్పుడు స్విస్‌ ప్రతిష్ఠకు మకుటం..

స్విట్జర్లాండ్‌ రైల్‌ నెట్‌వర్క్‌కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా 1856లో క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) ఏర్పాటైంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్థిక రంగంలో కీలక సంస్థగా మారింది. ఓ దశలో అమెరికా దిగ్గజమైన జేపీ మోర్గాన్‌ చేజ్‌తో పోటీ పడింది. కానీ, గతకొన్ని దశాబ్దాలుగా అనేక కుంభకోణాలు ఈ బ్యాంకులో వెలుగులోకి వచ్చాయి. సమస్యల నుంచి గట్టెక్కించే సంస్కరణల ఫలాల్ని నిర్వహణ లోపాలు నీరుగార్చాయి. మరోవైపు అనేక వివాదాలు చుట్టుముట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఫలితంగా సంస్థ ప్రతిష్ఠ మసకబారింది. ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లింది.

ఎస్‌వీబీతో తెరపైకి..

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనంతో అందరి కళ్లూ క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)పైకి మళ్లాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న సౌదీ నేషనల్‌ బ్యాంక్‌.. ఇకపై క్రెడిట్‌ సూయిజ్‌కు నిధులు సమకూర్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆందోళన తీవ్రమైంది. స్టాక్‌ మార్కెట్లలోని షేర్ల పతనం ఊపందుకుంది. స్విస్‌ కేంద్ర బ్యాంకు ఆఫర్‌ చేసిన 54 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం సైతం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోయింది. చేసేదిలేక ప్రభుత్వమే రంగంలోకి దిగింది.

వడ్డీరేట్ల పెంపు గందగోళానికి సాక్షి..

క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) ప్రపంచంలోనే కీలక 30 బ్యాంకుల్లో ఒకటి. కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక వ్యవస్థలో ప్రారంభమైన గందరగోళానికి ఇది సాక్షిగా నిలిచింది. కఠిన విధాన నిర్ణయాల ప్రతికూల ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తాజా డీల్‌ వల్ల ఉన్నపళంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం మాత్రం తప్పిందని విశ్లేషిస్తున్నారు.

బ్యాంకులు స్విట్జర్లాండ్‌కు కీలకం..

2008 నాటి ఆర్థిక సంక్షోభానికి ముందుకు క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) ఆస్తులు 1 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండేవి. అవి ప్రస్తుతం 580 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఈ బ్యాంకు మిగిలిన వాటికి భిన్నంగా 2008 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో ఎలాంటి బెయిలవుట్‌ ప్యాకేజీ అవసరం లేకుండానే మనుగడ సాగించడం విశేషం. అలాంటిది ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోవడం స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే. ఆ దేశంలో 243 బ్యాంకింగ్‌ గ్రూపులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 24 విదేశీ బ్యాంకుల శాఖలు ఉన్నాయి. ఇలా ఆ దేశానికి ఆర్థిక పరిశ్రమ చాలా కీలకంగా మారింది. యూబీఎస్‌, క్రెడిట్‌ సూయిజ్‌ ఆస్తులే.. ఆ దేశ జీడీపీ కంటే రెట్టింపు కావడం గమనార్హం.

యూబీఎస్‌- క్రెడిట్‌ సూయిజ్‌ ఒప్పందంలోని కీలకాంశాలు..

  • క్రెడిట్‌ సూయిజ్‌ పూర్తి షేర్లను 3 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌తో యూబీఎస్‌ కొనుగోలు చేస్తుంది.
  • దీని కోసం 100 బిలియన్‌ ఫ్రాంక్ల క్రెడిట్‌ లైన్‌ను స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ సమకూరుస్తుంది.
  • క్రెడిట్‌ సూయిజ్‌ ఆస్తుల వల్ల సంభవించబోయే నష్టాలకుగానూ స్విస్‌ ప్రభుత్వం 9 బిలియన్‌ ఫ్రాంక్‌ల గ్రాంట్‌ ద్వారా పూచీకత్తు అందజేస్తుంది.
  • 16 బిలియన్‌ ఫ్రాంక్‌లు విలువ చేసే క్రెడిట్‌ సూయిజ్‌ బాండ్లు విలువను కోల్పోతాయి.
  • క్రెడిట్‌ సూయిజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాన్ని యూబీఎస్‌ క్రమంగా కుదిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు