Aadhaar: ఆధార్‌ ధ్రువీకరణ.. రాష్ట్రాలకు ఉడాయ్‌ కీలక సూచన!

నకిలీ ఆధార్‌లకు అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను ఉడాయ్‌ కీలక సూచన చేసింది. దీంతో ఆధార్‌ దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరడంలో పారదర్శకత ఉంటుందని తెలిపింది. 

Published : 25 Nov 2022 01:00 IST

దిల్లీ:  ఆధార్‌ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు, సంబంధిత సంస్థలకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI)) కీలక సూచన చేసింది. ఈ మేరకు ఆధార్‌ను భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఆమోదించడానికి ముందు దాన్ని ధ్రువీకరణను తనిఖీ చేయాలని కోరింది. ఈ-ఆధార్‌, ఆధార్‌ లెటర్‌, ఆధార్ పీవీసీ, ఎం-ఆధార్‌.. ఇలా ఏ పద్ధతిలోనైనా వ్యక్తిగతంగా ఆధార్‌ను సమర్పిస్తే, ఆధార్‌ నంబర్‌ సాయంతో అది అసలైనదా? నకిలీదా? అనేది తనిఖీ చేయాలని ఉడాయ్‌ కోరింది.  ఈ ప్రక్రియవల్ల ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతతోపాటు, నకిలీ ఆధార్‌లను నియంత్రించవచ్చని ఉడాయ్‌ భావిస్తోంది. ఈ మేరకు ఆధార్‌ ధ్రువీకరణ అవసరాన్ని వివరిస్తూ.. అందుకు రాష్ట్రాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 

  • ఎవరైనా తమ పేరు, వయస్సు, చిరునామా ధ్రువీకరణ పత్రంగా  ఆధార్‌ సమర్పిస్తే, దాన్ని అనుమతించకుండా.. ఆధార్‌ నంబర్‌తో అందులోని వివరాలు సరిచూడాలని సూచించింది. ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్‌లోను ఆధార్‌ తనిఖీ చేయవచ్చని తెలిపింది. 
  • ఇందుకోసం ఎమ్‌ఆధార్‌ (mAashaar) యాప్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ యాప్‌తో వెరిఫై చేయొచ్చని వెల్లడించింది. ఎమ్‌ఆధార్‌ యాప్‌లో వెరిఫై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేస్తే యాక్టివ్‌లో ఉందో? లేదో? చూపిస్తుంది. 
  • మొబైల్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆన్‌ చేసి ఆధార్‌ కార్డ్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్‌ చేసినా.. ఆధార్‌ వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు, ఆధార్‌ కార్డ్‌పై ఉన్న వివరాలతో సరిపోలితే.. ఆ కార్డు ఒరిజినల్‌ అని భావించాలి. ఒకవేళ వివరాలు సరిపోలకుంటే అది నకిలీ కార్డుగా పరిగణించాలి. 
  • అనుమతి లేకుండా మార్పులు చేయడం, నకిలీ ఆధార్‌ సృష్టించడం వంటివి ఆధార్‌ చట్టం సెక్షన్‌ 35 ప్రకారం శిక్షార్హమైన నేరాలుగా ఉడాయ్‌ పేర్కొంది. అసాంఘిక శక్తులు అనైతిక అంశాల్లో ఆధార్‌ను ఉపయోగించకుండా అడ్డుకునేందుకు రాష్ట్రాలు ఈ సూచనలు అనుసరించాలని కోరింది.
  • ఆధార్‌ కేవలం12 అంకెల నంబర్‌తో ఉన్న కార్డుగా మాత్రమే కాకుండా,  విశిష్ఠ గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డు కొనుగోలు ఇలా ప్రతి పనికి ఆధార్‌ తప్పనిసరైంది. సుమారు వెయ్యికిపైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పథకాల అమలులో ఆధార్‌ ధ్రువీకరణ అనుమతించే దిశగా రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు ఉడాయ్‌ తెలిపింది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని