Boris Johnson: నెలాఖరున భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని..స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం ఖరారు?

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఈ నెలాఖరులో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని సమాచారం....

Published : 05 Apr 2022 13:56 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఈ నెలాఖరులో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికై ఆయన భారత్‌ను సందర్శించొచ్చని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఏప్రిల్‌ 22వ తేదీకి అటూఇటూగా ఆయన భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉంది. కొవిడ్‌-19 నేపథ్యంలో గత ఏడాదే ఆయన పర్యటన రెండుసార్లు వాయిదా పడింది. గత నెల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ఇరువురు నేరుగా కలవడానికి బోరిస్‌ ఆసక్తి చూపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా ఎటువంటి చర్యలకైనా ఇద్దరు నేతలు అంగీకరించినట్లు పేర్కొన్నాయి. వాణిజ్య, వ్యాపార, రక్షణ, భద్రత వంటి అంశాల్లో సహకారాన్ని కొనసాగించాలని ఇరువురు  ఆకాంక్షించినట్లు తెలిపాయి.

మోదీని కలవడానికి బోరిస్‌ చాలా ఆసక్తిగా ఉన్నట్లు గతవారం బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికోసం ఇంకా ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని తెలిపింది. ఇరువురు నేతలు చివరిసారి గత ఏడాది నవంబరులో జరిగిన కాప్‌ 26 సదస్సులో కలిశారు. ఆ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030కల్లా రెండింతలు చేయాలన్న లక్ష్యంపై ప్రధానంగా చర్చలు జరిపారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటిష్‌ వ్యాపారులు, శ్రామికులు, వినియోగదారులకు భారీ లబ్ధి చేకూరనుందని గతంలో బోరిస్‌ తెలిపారు. ఒకవేళ బోరిస్‌ పర్యటన ఖరారైతే మూడో దశ ఇండియా-యూకే ఎఫ్‌టీఏ చర్చలు కూడా అప్పుడే జరిగే అవకాశం ఉందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని