Published : 10 Mar 2022 02:05 IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌ సంక్షోభం.. భారత్‌లో ఆహార, వ్యవసాయ రంగంపై ప్రభావమెంత..?

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు గురవుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు ఆహార వస్తువుల ధరలు దారుణంగా పెరుగుతాయనే భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుతుందని అంచనాలు వెలుబడుతున్నాయి. దీంతో కుటుంబ ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, ఆహార వస్తువులపై ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశంపై మార్కెట్‌ రంగ నిపుణుల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 

భారత్‌పై ప్రభావం ఏ మేరకు..? 

ఉత్పత్తితోపాటు వాణిజ్య కేంద్రంగా ఉన్న ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం తప్పకుండా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముడిచమురు, గోధుమలు, మొక్కజొన్న, వంటనూనెతోపాటు ఎరువుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ముడిచమురు ధర 139 డాలర్లకు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2008 తర్వాత ఈస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోధుమ, మొక్కజోన్న ధరల్లోనూ విపరీతంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇక వంటనూనెల దిగుమతిపై భారత్‌ ఆధారపడిన నేపథ్యంలో.. వంట నూనెలు, ఎరువులపై ఉక్రెయిన్‌ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల కొరత ఏర్పడే ఆస్కారం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. 

భారీగా నిల్వలు ఉన్నప్పటికీ.. 

దేశంలో ఫిబ్రవరి నాటికి బియ్యం, గోధుమల నిల్వ 54 మిలియన్‌ టన్నులుగా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన దానికంటే ఇది చాలా ఎక్కువ. ఇక ఈ నెలాఖరు వరకు మార్కెట్‌లోకి గోధుమలు రికార్డు స్థాయిలో రానున్నాయి. దీంతో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం తన దగ్గర ఉన్న గోధుమ నిల్వలను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉక్రెయిన్‌లో సంక్షోభం తీవ్రరూపం దాల్చితే గోధుమల ఎగుమతిపై ప్రభావం పడుతుంది. రిటైల్‌ ధరలు మరింత పెరగవచ్చు. వీటితోపాటు చమురు, ఇంధన ధరల కలిసి మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల గరిష్ఠ స్థాయికి చేరవచ్చనేది నిపుణుల అంచనా. 

రైతాంగంపై ప్రభావం.. 

ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో పంట ఉత్పత్తులపై ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకంటే ఎక్కువ పలకొచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఇప్పటికే హోల్‌సేల్‌ గోధుమల ధర కనీస మద్దతు ధరకంటే ఎక్కువగా ఉంది. ఆవాల పరిస్థితి అంతే. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగవచ్చు. ఇదే సమయంలో పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామం రైతులకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. 

ముడిచమురు ధరల ప్రభావం..? 

ముడిచమురు ధరలు పెరిగిన ప్రతిసారి ఆహార ధరలు పెరుగుతాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ముడిచమురు ఒక్క బ్యారెల్‌ ధర 120 నుంచి 130 డాలర్ల మధ్య కొనసాగుతోంది. ఒకవేళ ముడిచమురు ఒక్క బ్యారెల్‌ ధర 110 నుంచి 100 డాలర్లకు తగ్గినప్పటికీ ఎరువుల రవాణా ధరలపై వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరోవైపు గత నవంబర్‌ నుంచి ఇంధన ధరలు పెంచనందున త్వరలోనే గణనీయమైన పెరుగుదల ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి ప్రభుత్వ చర్యలు ఏమిటి..? 

ధాన్యం నిల్వలను నియంత్రించడం బదులు తృణధాన్యాల ధరల ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం దిగుమతులను పరిమితం చేసే అవకాశం ఉంది. ఇక వంటనూనెలపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. జనవరిలో రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం 5.4శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చు. అయితే, ఆహార కొరతను తీర్చేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను విస్తరించడం ద్వారా మరిన్ని కుటుంబాలను ఆదుకోవచ్చు. ఇక ఎరువుల విషయంలో కెనడా, ఇజ్రాయెల్‌, చైనా దేశాలను నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని