PSU Banks: రూ.35వేల కోట్లు.. క్లెయిమ్‌ చెయ్యని డిపాజిట్లు ఆర్బీఐకి!

జాతీయ బ్యాంకుల్లో (Banks) క్లెయిమ్‌ చెయ్యని డిపాజిట్లు (Unclaimed Deposits) రూ.35వేల కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మొత్తాన్ని రిజర్వు బ్యాంకుకు (RBI) బదిలీ చేసినట్లు తెలిపింది.

Published : 03 Apr 2023 23:16 IST

దిల్లీ: జాతీయ బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను (Unclaimed Deposits) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (RBI) బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పదేళ్లు, అంతకుమించి నిర్వహణలో లేని డిపాజిట్ల మొత్తం ఫిబ్రవరి 2023 నాటికి రూ.35,012 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇలా నిర్వహణ లేని 10.24కోట్ల ఖాతాలకు చెందిన డిపాజిట్లను ఆర్బీఐకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పార్లమెంటుకు తెలియజేసింది.

ఆర్బీఐ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2023 నాటికి నిర్వహణలో లేని ఖాతాలకు చెందిన రూ. 35,012 కోట్లను ఆర్బీఐకి బదిలీ చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భాగవత్‌ కరాడ్‌ లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వీటిలో అత్యధికంగా రూ.8086కోట్లు భారతీయ స్టేట్‌ బ్యాంకు (SBI)లోనే ఉండగా.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.5340 కోట్లు, కెనరా బ్యాంకులో రూ.4558 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.3904 కోట్లు ఉన్నాయని చెప్పారు.

మరణించిన ఖాతాదారుల క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌కు సంబంధించి, వారి కుటుంబ సభ్యులకు ఎస్బీఐ సిబ్బంది సహాయం అందిస్తారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల సిబ్బందికి సూచనలు ఇచ్చామని అన్నారు. క్లెయిమ్‌ చేయని ఖాతాదారుల ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్‌లను కూడా చేపట్టాలని బ్యాంకులను తెలియజేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని