Govt vs RBI: ఉర్జిత్‌పై మోదీ ఆగ్రహం.. పాముతో పోలిక: పుస్తకంలో సుభాష్‌ గార్గ్‌

నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌పై ప్రధాని మోదీ ఆగ్రహించారని, ఆయనను పాముతో పోల్చారని సుభాష్‌ గార్గ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

Updated : 27 Sep 2023 21:51 IST

దిల్లీ: గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), భారత ప్రభుత్వం (Govt) మధ్య పొడచూపిన వివాదాల గురించి తాజాగా మరో పుస్తకంలో ప్రచురితమైంది. ఆర్‌బీఐ నిధుల బదిలీ గురించి ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తన పుస్తకంలో ప్రస్తావించగా.. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ అందులో మరో కోణాన్ని బయటపెట్టారు. ఉర్జిత్‌ పటేల్‌ (Urjit Patel) గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆర్‌బీఐ అనేక అంశాల్లో ప్రభుత్వంతో విభేదించిందని పేర్కొన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్లు, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి విషయాల్లో ఆర్‌బీఐ అడ్డుపుల్ల వేసిందని తెలిపారు. ఈ మేరకు ‘వియ్‌ ఆల్సో మేక్‌ పాలసీ’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో పలు విషయాలు పేర్కొన్నారు.

2017-2019 మధ్య సుభాష్‌ గార్గ్‌ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. పంటలకు మద్దతు ధర, ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌, బ్యాంకులకు నిధుల సమకూర్చడం, ఎయిర్‌ పోర్టుల మానిటైజేషన్‌ వంటి అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయన అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలను తన పుస్తకంలో ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో విభేదించడంతో పాటు కొన్ని విషయాల్లో నాడు ఆర్‌బీఐ ఏకపక్షంగా వ్యవహరించిందని గార్గ్‌ పేర్కొన్నారు. పేమెంట్‌ సిస్టమ్‌ డేటా లోకలైజేషన్‌ విషయంలో పూర్తి ఏకపక్షంగా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అదే విధంగా ఆర్‌బీఐ నగదు నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయంలోనూ పటేల్‌ అయిష్టత కనబరిచారని గార్గ్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా ఆర్‌బీఐ తలొగ్గలేదు: విరాల్‌ ఆచార్య

‘‘దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో 2018 సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రధాని ఉర్జిత్‌ పట్ల ఆగ్రహంగా చూశారు. అంతటి కోపం నేను ఎప్పుడూ చూడలేదు. నిరర్థక ఆస్తుల విషయంలో ఆర్‌బీఐ వైఖరి, పరిష్కారాలను కనుగొనడంలో ఆర్‌బీఐ అస్థిరమైన విధానాలను మోదీ తప్పుబట్టారు. అదే సమయంలో ఉర్జిత్‌ పటేల్‌ చేసిన ఎల్‌టీసీజీ ట్యాక్స్‌ను ఉపసంహరణ ప్రతిపాదననూ మోదీ వ్యతిరేకించారు ’ అని గార్గ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఆర్‌బీఐ నిల్వలలను ఎందుకూ వినియోగించడానికి వీల్లేని విధంగా ‘డబ్బుల గుట్టపై కూర్చున్న పాము’లా ఉర్జిత్‌ను మోదీ పోల్చారని గార్గ్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వానికి చెప్పకుండానే రాజీనామా

ఒకరోజు తాను నార్త్‌ బ్లాక్‌లో మీటింగ్‌ పూర్తి చేసుకుని తన రూమ్‌లోకి వచ్చేటప్పుడు.. ఉర్జిత్‌ రాజీనామా వార్త తాను టీవీల్లో చూశానని పేర్కొన్నారు. రాజీనామా విషయంలోనూ ఆయన నిబంధనలు పాటించలేదన్నారు. ప్రభుత్వానికి రాజీనామా లేఖ పంపించకుండా ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఆ ప్రతిని ఉంచి ఆయన ఇంటికెళ్లిపోయారని, వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారని గార్గ్‌ తెలిపారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి సైతం ఈ విషయంలో ముందస్తు సమాచారం లేదని తెలిపారు. ఆయన సైతం వెంటనే రాజీనామాకు ఆమోదం తెలిపారని గార్గ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని