Warranty: ఏ వస్తువుకైనా వారెంటీ వర్తించాలంటే.. ఇవన్నీ చూసుకోవాలి!

ఏదైనా వస్తువు కొనే ముందు దానికి వారెంటీ ఉందేమో చూసుకోవాలి. ఉంటే నియమ నిబంధనల్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

Updated : 13 Oct 2022 13:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి ప్రయోజనం పొందేందుకు చాలా మంది పెద్ద వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ వస్తువు ఫీచర్లు, ప్రయోజనాలు, లోపాలను మాత్రమే అధ్యయనం చేస్తే సరిపోదు. దాని వారెంటీ (warranty) అందించే రక్షణ స్థాయిని కూడా తప్పనిసరిగా అంచనా వేయాలి. వారెంటీ  (warranty) అంటే ఒక చిన్న స్థాయి బీమా పాలసీగా పరిగణించవచ్చు. కొన్న వస్తువుపై వినియోగదారుడికి తయారీదారు ఇచ్చే హామీనే వారెంటీ. నిర్దిష్ట వ్యవధిలో అది పని చేయడం ఆపేసినా లేదా ఏదైనా మరమ్మతు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా బాగు చేయించి ఇవ్వడమే దీని లక్ష్యం.

షరతులను పూర్తిగా చదవాలి..

సాధారణంగా మన దేశంలో లభించే చాలా వరకు వారెంటీ (warranty)లు పాడైన పూర్తి వస్తువు లేదా దాంట్లో కొంత భాగాన్ని బేషరతుగా మారుస్తామని హామీ ఇవ్వవు. చాలా కొర్రీలు వేస్తారు. అందుకే ఏదైనా వస్తువును కొనేముందు దాని వారెంటీ పాలసీని నిశితంగా చదవాలి. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. వారెంటీ ఎంతకాలం వర్తిస్తుంది? ఎలాంటి మరమ్మతులకు అందిస్తారు? ఏమైనా షరుతులు ఉన్నాయా? వంటి అంశాలను ముందే తెలుసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లో కొనే వాటికి, ఆఫ్‌లైన్‌ కొనేవాటికీ వారెంటీ ఒకే తరహాలో ఉండకపోవచ్చు.

ఒకవేళ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే.. వారెంటీ సర్వీసు ఎవరు అందిస్తారు? ఎక్కడ అందిస్తారు? ఏదైనా సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలి? వంటి వివరాలను ముందే చెక్‌ చేసుకోవాలి. సాధారణంగా మన తీసుకునే వస్తువుపై ఇన్నేళ్ల వారెంటీ అని పెద్ద సీల్‌ వేసి ఉంచుతారు. కానీ, షరతుల్లోకి వెళ్లి చూస్తే.. ‘‘విక్రేతల విచక్షణపై వారెంటీ ఆధారపడి ఉంటుంది’’ అని రాసి ఉండడం ఒక్కోసారి గమనించొచ్చు. అలాంటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వారిచ్చిన గడువులో ఒక్కసారి కూడా మనం వారెంటీ వినియోగించుకోవాల్సిన అవసరం రాకపోతే.. దాన్ని పొడిగిస్తారేమో అడిగి తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి.

స్టాంప్‌ వేయని వారెంటీ కార్డు..

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు ఒక్కోసారి దాని వారెంటీ కార్డుపై ఎలాంటి స్టాంప్‌ ఉండకపోవచ్చు. ఇది భవిష్యత్‌లో మీకు ఇబ్బంది తెచ్చిపెట్టొచ్చు. అలాంటప్పుడు దగ్గర్లోని సర్వీసు సెంటర్‌కు వెళ్లి ఇన్వాయిస్‌ చూపించి.. స్టాంప్‌ను వేయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఇన్వాయిస్‌ లేకపోతే.. ఇ-కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

వారెంటీ పొడిగింపు..

వినియోగ వస్తువులపై సాధారణంగా తయారీ కంపెనీలే నిర్దిష్ట కాలానికి వారెంటీ కల్పిస్తాయి. అయితే, కొన్నిసార్లు కొనే సమయంలోనే దాన్ని పొడిగించుకునేందుకు విక్రేతలు అవకాశం కల్పిస్తారు. దీన్నే ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ (Extended warranty) అంటారు. ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు దీన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని తయారీ సంస్థలే కాకుండా థర్డ్‌ పార్టీ కంపెనీలు కూడా ఆఫర్‌ చేస్తుంటాయి. అయితే, ఒరిజినల్‌ వారెంటీ నియమ, నిబంధనల్ని క్షుణ్నంగా చదివి.. అవసరమనుకుంటేనే ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి తయారీ కంపెనీలు ఇచ్చే వారెంటీయే సరిపోతుంది. అలాగే తయారీదారు ఇస్తున్న హామీ కంటే అదనపు ప్రయోజనాలు ఉంటేనే ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ తీసుకోవాలి. లేదంటే పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఆన్‌లైన్ వారెంటీ..

ఆన్‌లైన్‌ వారెంటీని థర్డ్‌ పార్టీ సంస్థలు అందిస్తాయి. కొత్త వస్తువులు లేదా కొంతకాలం వినియోగించిన వస్తువులకు కూడా కొన్ని కంపెనీలు వీటిని అందిస్తుంటాయి. వివిధ కాలపరిమితులు, వివిధ స్థాయిలతో కూడిన వారెంటీ పాలసీలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, కొన్ని పరిమిత సంస్థలు లేదా విక్రేతలు లేదా పంపిణీదారులు ఇచ్చే వస్తువులపై మాత్రమే కంపెనీలు ఆన్‌లైన్ వారెంటీ ఇస్తుంటాయి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

మీరు ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారనుకోండి. అది ఒకవేళ విదేశాల నుంచి వస్తున్నట్లయితే.. దానికి విక్రేతలు ఎలాంటి వారెంటీ ఇవ్వరు. అలాంటప్పుడు మనం ప్రత్యేకంగా కొనాల్సి ఉంటుంది.

విద్యుత్తు సరఫరాలో లోపాలు, తప్పుడు బ్యాటరీని వినియోగించడం, అనధీకృత ఏజెన్సీలు మధ్యలోనే వస్తువును ఓపెన్‌ చేసినట్లు గుర్తిస్తే దానికి వారెంటీ వర్తించదు.

చాలా తయారీ కంపెనీలు వారెంటీ కార్డు లేదా బిల్లును రిజిస్టర్‌ చేసుకోవాలని చెబుతుంటాయి. అప్పుడే మీ వారెంటీ పాలసీ ప్రారంభమవుతుంది. లేదంటే ప్రయోజనం ఉండదు. అందుకే వారు నిర్దేశించిన గడువులోగా వారెంటీని రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఏదైనా ప్రొడక్ట్‌ను కొనే ముందు దాన్ని ఎలా రిటర్న్‌ చేయాలి? రద్దు చేసుకోవాలి? రీఫండ్‌ ఎలా చేస్తారు? వంటి వివరాలు తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని