Unemployment: డిసెంబరులో 8.3శాతానికి నిరుద్యోగ రేటు.. హరియాణాలో అత్యధికం

2022లో అత్యధిక నిరుద్యోగ రేటు (Unemployment Rate) డిసెంబరులోనే నమోదైంది. హరియాణాలో అత్యధికంగా తర్వాత రాజస్థాన్‌, దిల్లీలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది.

Published : 02 Jan 2023 19:26 IST

ముంబయి: గడిచిన డిసెంబరులో దేశంలో నిరుద్యోగ రేటు (Unemployment Rate) 8.3 శాతానికి పెరిగింది. 2022లో ఇదే గరిష్ఠమని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ తెలిపింది. నవంబరులో 8 శాతం, సెప్టెంబరులో 6.43 శాతంగా నిరుద్యోగ రేటు (Unemployment Rate) నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆగస్టులో 8.28 శాతమే గరిష్ఠంగా ఉంది. డిసెంబరులో దాన్ని కూడా అధిగమించి 8.3 శాతంగా నమోదైంది.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉన్నట్లు సీఎంఐఈ గణాంకాలు తెలిపాయి. డిసెంబరులో పట్టణాల్లో నిరుద్యోగిత 10 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా ఉంది. హరియాణాలో 37.4 శాతంతో అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది. తర్వాత రాజస్థాన్‌ (28.5%), దిల్లీ (20.8%), బిహార్‌ (19.1%), ఝార్ఖండ్‌ (18%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తాజా సీఎంఐఈ గణాంకాలపై టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సహ-వ్యవస్థాపకురాలు రితుపర్ణ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. జనన, మరణాల రేటు; ఆర్థిక ప్రగతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగం విషయంలో భారత్‌ ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. చైనా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో జరిగినట్లుగా కార్మిక శ్రామికశక్తిలో కొత్త చేరికలు మందగించే అవకాశం ఉందని తెలిపారు. సంఘటిత రంగంలో ఉద్యోగ కల్పన.. కావాల్సిన దానికంటే తక్కువ స్థాయిలో ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని