Amazon: ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్‌కు కేంద్రం నోటీసులు

Amazon: అమెజాన్‌ ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఇలా అర్ధాంతరంగా సిబ్బందిని తొలగించడం చట్టవిరుద్ధమని నైట్స్‌ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ కోరుతూ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

Published : 23 Nov 2022 17:36 IST

దిల్లీ: భారత్‌లో భారీ ఎత్తున ఉద్యోగుల్నితొలగించిన నేపథ్యంలో ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు కేంద్ర కార్మిక శాఖ మంగళవారం నోటీసులు జారీ చేసింది. బెంగళూరు కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ముందు బుధవారం (నవంబరు 23న) హాజరు కావాలని ఆదేశించింది. ఉద్యోగుల తొలగింపు, దానికి గల కారణాలకు సంబంధించిన పత్రాలతో అమెజాన్‌ ప్రతినిధి రావాలని తెలిపింది.

ఉద్యోగుల తొలగింపు విషయంలో అమెజాన్‌ కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ‘నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES)’ కేంద్ర కార్మిక శాఖకు ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం అమెజాన్‌ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. సిబ్బందిని కంపెనీ బలవంతంగా తొలగించిందని.. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు రాసిన ఫిర్యాదు లేఖలో నైట్స్‌ తెలిపింది. దీనివల్ల అనేక మంది జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం.. ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ సంస్థా తమ ఉద్యోగులను తొలగించడానికి వీల్లేదని నైట్స్‌ పేర్కొంది.

వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2023లోనూ సిబ్బంది తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఇటీవలే అమెజాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని