hybrid vehicles: హైబ్రిడ్‌ వాహనాలపై ఆ రాష్ట్రం గుడ్‌ న్యూస్‌.. రోడ్డు ట్యాక్స్‌ మాఫీ

Hybrid Vehicles: హైబ్రిడ్‌ వాహనాలపై 100శాతం రోడ్డు ట్యాక్స్‌ను మాఫీ చేస్తూ యూపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అక్కడ ఈ కార్ల ధరలు దాదాపు రూ.3లక్షల వరకు తగ్గనున్నాయి.

Updated : 09 Jul 2024 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వాహనదారులకు శుభవార్త చెప్పింది. హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్లు (Hybrid Vehicles), ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై రహదారి పన్నును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పెట్రోల్‌, డీజిల్‌ కార్ల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడంతో పాటు హరిత వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు యూపీ సర్కారు వెల్లడించింది. రోడ్డు ట్యాక్స్‌ (Road Tax)ను ఎత్తివేయడంతో వినియోగదారులపై భారం తగ్గుతుంది. పలితంగా ఈ హైబ్రిడ్‌ వాహనాలకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో మారుతి సుజుకీ, హోండా, టయోటా విక్రయాలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ సంస్థలు గ్రాండ్‌ విటారా, అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌, ఇన్నోవా హైక్రాస్‌, హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ వంటి హైబ్రిడ్‌ కార్లను అందిస్తున్నాయి.

రోడ్డు ట్యాక్స్‌ (Road Tax)ను మినహాయించడంతో యూపీలో మారుతి సుజుకీ, హోండా హైబ్రిడ్‌ మోడళ్ల ధర రూ.1.98లక్షల నుంచి రూ.2.88లక్షల వరకు దిగిరానుంది. ఇక, టయోటా మోడళ్లపై గరిష్ఠంగా రూ.3.11లక్షల వరకు తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కునాల్ బెహల్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది చరిత్రాత్మక నిర్ణయం. మార్కెట్లో పర్యావరణహిత వాహనాల విక్రయాలను పెంచుతుంది. ఇలాంటి సృజనాత్మక ఆలోచనలతో వాయు కాలుష్యాన్ని నివారించొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

హైబ్రిడ్‌ కార్లపై రోడ్డు ట్యాక్స్‌ను మినహాయిస్తూ యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో నేటి స్టాక్‌ మార్కెట్లలో ఈ వాహనాల తయారీ సంస్థల షేర్లు రాణించాయి. మారుతి సుజుకీ షేరు ధర 6.52శాతం పెరిగి రూ.12,807 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో దీని షేరు ధర 7శాతానికి పైగా ఎగబాకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని