Ather 450X: కొత్త ఫీచర్లతో ఏథర్‌ 450ఎక్స్‌.. మరిన్ని కలర్‌ ఆప్షన్స్‌!

Ather 450X New version: ఏథర్‌ తన 450ఎక్స్‌ మోడల్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మరిన్ని రంగులనూ తీసుకొచ్చింది. వారెంటీని సైతం ఐదేళ్లకు పొడిగించింది.

Updated : 07 Jan 2023 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) మరిన్ని ఫీచర్లతో కొత్త 450X ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటు, సీటింగ్‌లో మార్పులు చేపట్టింది. మరిన్ని రంగులనూ పరిచయం చేసింది. ఏథర్‌ కమ్యూనిటీ డే పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది.

ఏథర్‌ స్టేక్‌ 5.0 పేరిట సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఏథర్‌ తీసుకొచ్చింది. టచ్‌స్క్రీన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో కొన్ని మార్పులు చేసింది. కొత్త యూఐలో యూజర్‌ తనకు నచ్చిన ఆప్షన్స్‌ను పెట్టుకోవచ్చు. అలాగే, గూగుల్‌తో కలిసి వెక్టార్‌ మ్యాప్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో నావిగేషన్‌తో పాటు లైవ్‌ ట్రాఫిక్‌ను కూడా చూడొచ్చు. అచ్చం ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ఉన్న అనుభూతి ఇందులో కలుగుతుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్‌ ఆటో హోల్డ్‌ ఫంక్షన్‌ లేదా హిల్‌ హోల్డ్‌. ఈ ఫీచర్‌ ద్వారా ఎత్తు, పల్లం ఉండే ప్రదేశాల్లో స్కూటర్‌ వెనక్కి లేదా ముందుకు వెళ్లకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. అలాగే పొడవుగా ఉండే వ్యక్తులకు అనువుగా సీటింగ్‌ను సైతం మెరుగుపర్చారు. ట్రూ రెడ్‌, కాస్మిక్‌ బ్లాక్‌, సాల్ట్‌ గ్రీన్‌, లూనర్‌ గ్రే పేరిట నాలుగు రంగులను తీసుకొచ్చారు.

ఇక ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ ప్రోగ్రాములో భాగంగా ప్రస్తుతం మూడేళ్లుగా ఉన్న స్టాండర్డ్‌ వారెంటీకి అదనంగా మరో 2 ఏళ్లు ఇవ్వనున్నారు. అంటే కొత్తగా ఏథర్‌ను కొనుగోలు చేసే వారికి 5 ఏళ్ల స్టాండర్డ్‌ వారెంటీ లభిస్తుందన్నమాట. పాత వినియోగదారులు సైతం ఈ వారెంటీలో చేరే అవకాశం కల్పిస్తోంది. అలాగే ఏథర్‌ 450X ఫస్ట్‌ జనరేషన్‌ బైక్‌ను కొని మూడేళ్లు దాటిన వారికి రూ.90వేలు చెల్లించడం ద్వారా కొత్త బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని