ఫీచ‌ర్ ఫోన్ వాడుతున్నారా? తెలుగు వాయిస్‌తో ఇక UPI చెల్లింపులు!

వాయిస్ఎస్ఈ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రాంతీయ‌ భాషల్లో యూపీఐ వాయిస్ చెల్లింపు సేవ‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published : 10 Sep 2022 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ చెల్లింపు వ్య‌వ‌స్థ గ‌తంలో స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేది. కానీ 'యూపీఐ 123పే' సేవ‌ల‌ను ప్రారంభించిన త‌ర్వాత ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారుల‌కూ ఆ సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇప్పుడు ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన భాష‌లో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం టోన్‌ ట్యాగ్ సంస్థ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్థ దేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల భాగ‌స్వామ్యంతో 'యూపీఐ 123 పే' సేవ‌ల‌ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది. ప్ర‌స్తుతం టోన్ ట్యాగ్‌ ఫ‌స్ట్ వాయిస్‌ సొల్యూష‌న్‌తో ఈ సేవ‌ల‌ను మ‌రింత‌ విస్త‌రించ‌నున్న‌ట్లు తెలిపింది.

ఇది పట్టణ, గ్రామీణ భార‌త‌దేశం మధ్య ఉన్న డిజిటల్ చెల్లింపుల అంత‌రాన్ని తగ్గిస్తుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో యూపీఐ చెల్లింపులు చేసేందుకు అనుమ‌తిస్తుందని పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ సేవ‌లు కొన్ని ప్రాంతీయ భాష‌ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయని, త్వ‌ర‌లోనే గుజరాతీ, మరాఠీ, పంజాబీ వంటి మ‌రికొన్ని భాష‌ల‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని ఆ సంస్థ వెల్లడించింది.

ఎలా ప‌నిచేస్తుంది?

చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబ‌ర్‌కు కాల్ చేసి వారి ప్రాంతీయ భాష‌ను ఎంపిక చేసుకుని ఆర్థిక లావాదేవీలు కొన‌సాగించ‌వ‌చ్చు. ఈ సేవ‌తో వినియోగ‌దారులు నిధుల‌ను బ‌దిలీ చేయ‌లేరు. యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి వాయిస్ ఉప‌యోగించి చేయ‌వ‌చ్చు. ఎన్ఎస్‌డీఎల్ పేమెంట్స్ బ్యాంక్‌, ఎన్‌పీసీఐ భాగ‌స్వామ్యంతో ఈ సదుపాయాన్ని టోన్‌ ట్యాగ్‌ సంస్థ తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని