Term insurance: ట‌ర్మ్ ఇన్సూరెన్స్ క‌వ‌రేజ్.. ఎప్పటి వరకు.. ఎంత?

ట‌ర్మ్ బీమా పాల‌సీలో ప్రీమియం త‌క్కువ ఉండి ఎక్కువ బీమా ర‌క్ష‌ణ అవ‌కాశం ఉంటుంది. 

Updated : 16 Feb 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కుటుంబం, ఆర్థిక బాధ్యతలు ఉండే వారికి జీవిత బీమా చాలా అవ‌స‌రం. మీపై ఆర్థికంగా ఆధారపడేవారు ఉన్నప్పుడు త‌గినంత బీమా హామీ కోసం ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయ‌డం చాలా ముఖ్యమైనది. ఉద్యోగం/ఉపాధి మొద‌లైన వెంటనే చిన్నదైనా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. వివాహం, పిల్లలు కలిగిన త‌ర్వాత టర్మ్ ఇన్సూరెన్స్‌ని పెంచుకోవాలి. యుక్త వ‌య‌స్సులో బీమా తీసుకుంటే ప్రీమియం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. 60 లేదా 99 సంవ‌త్సరాల వ‌ర‌కు కూడా ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. 99 సంవ‌త్సరాల వరకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అవసరం అనే చెప్పాలి.

సాధార‌ణ ఎండోమెంట్ పాల‌సీలు ఎక్కువ ప్రీమియం క‌లిగి ఉండి, త‌క్కువ ఆర్థిక భద్రత ఇస్తాయి. అధిక చార్జీల వల్ల వీటికి ల‌భించే రాబడి, బోన‌స్ లాంటివి కూడా తక్కువే ఉంటున్నాయి. వీరు త‌క్కువ ప్రీమియం ఉండే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం చాలా అవ‌స‌రం. ట‌ర్మ్ బీమా పాల‌సీలో ప్రీమియం త‌క్కువ ఉండి, ఎక్కువ బీమా ర‌క్షణకు అవకాశం ఉంటుంది.

ధూమ‌పానం (పొగ‌), మ‌ద్యం తాగే వ్యక్తులకైతే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీ మొత్తాన్ని అంచ‌నా వేసేటప్పుడు మీ ఆదాయం, మీ ఆర్థిక లక్ష్యాలు, భవిష్యత్‌లో ద్రవ్యోల్బణ రేటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీ ప్రస్తుత వార్షిక ఆదాయంలో 15-20 రెట్లకు సమానమయ్యే బీమా పాల‌సీని తీసుకుంటే మంచిద‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. మీరు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు.. పాల‌సీ ప్రయోజనాలు, ఫీచర్లు, ప్రీమియం మొత్తం, బీమాదారు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఆధారంగా వివిధ బీమా కంపెనీల, పాల‌సీ ఆఫ‌ర్‌ల‌ను స‌రిపోల్చుకుని పాల‌సీ ఎంపిక చేసుకోవాలి.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి పాలసీ వ్యవధిలోపు మరణిస్తే.. ఆ వ్యక్తిపై ఆధార‌ప‌డ్డ నామినీలు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. పాల‌సీ మెచ్యూర్ అయితే పాల‌సీదారునికి ఏమీ రాదు. ట‌ర్మ్ ప్లాన్‌లో చెల్లించే ప్రీమియం పూర్తిగా లైఫ్ రిస్క్ క‌వ‌రేజీ అనుగుణంగా ప‌నిచేస్తుంది. త‌క్కువ ప్రీమియం చెల్లించ‌డం ద్వారా ట‌ర్మ్ ప్లాన్‌లో అధిక మొత్తం హామీని (లైఫ్ క‌వ‌ర్‌)ను కొనుగోలు చేయొచ్చు.

పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొన‌డం మొద‌లైన ల‌క్ష్యాలు సాధార‌ణంగా ఒక వ్యక్తి నిర్దిష్ట వ‌య‌స్సులో లక్ష్యాలు. సంపాదిం వ్యక్తి అకాల మ‌ర‌ణానికి గురయినప్పుడు.. మంచి మొత్తంలో ట‌ర్మ్ ఇన్సూరెన్స్ క‌లిగి ఉంటే ఈ పై ల‌క్ష్యాలు చేరుకునే అవ‌కాశాలు ఎక్కువ ఉంటాయి. పాల‌సీదారుడిపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యులు జీవ‌న ప్రమాణాల్లో రాజీప‌డ‌కుండా జీవించొచ్చు.

ఈ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి ఒక వ్యక్తికి 55-60 సంవ‌త్సరాలు వచ్చేస్తాయి. కాబ‌ట్టి క‌నీసం 60 సంవత్సరాల వరకు అధిక మొత్తం క‌వ‌రేజ్ ఉండేలా ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ఉండ‌టం చాలా అవ‌స‌రం. అయితే, స్వయం ఉపాధి పొందిన వారి ఉత్పాద‌క సామ‌ర్థ్యం 60 సంవ‌త్సరాల కంటే ఎక్కువ ఉండొచ్చు. కాబ‌ట్టి ఎక్కువ కాలం పాటు క‌వ‌రేజీని కోరుకోవచ్చు. వయసుతో బీమా ప్రీమియంలు కూడా పెరుగుతాయి. దాదాపు 60 ఏళ్ల వ‌య‌స్సులోపు మీరు త‌గినంత‌గా సేక‌రించిన నిధి.. మ‌రో 2-3 ద‌శాబ్దాల వ‌ర‌కు మీ కుటుంబాన్ని పోషించ‌గ‌ల నిక‌ర విలువ‌ను క‌లిగి ఉంటే, ఇక ఆ త‌ర్వాత ట‌ర్మ్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని