US: మాంద్యం అంచున అమెరికా..!

అమెరికాలో ప్రజలు, కంపెనీలు ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని గోల్డ్‌మన్‌శాక్స్‌ సీనియర్‌ ఛైర్మన్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌ పేర్కొన్నారు.

Published : 16 May 2022 19:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో ప్రజలు, కంపెనీలు ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని గోల్డ్‌మన్‌శాక్స్‌ సీనియర్‌ ఛైర్మన్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌ పేర్కొన్నారు. అమెరికా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని వెల్లడించారు. ఆయన ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వేళ నాకే ఏదైనా కంపెనీ ఉంటే.. నేను పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేవాడిని.. నేను వినియోగదారుడిని అయినా.. సిద్ధమయ్యేవాడిని’’ అని పేర్కొన్నారు. 

ఫెడరల్‌ రిజర్వ్‌ వద్ద ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాడానికి శక్తిమంతమైన విధానాలున్నాయని లాయిడ్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఫెడ్‌ బాగానే డీల్‌ చేస్తోందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఇంధన ధరలు, బేబీ ఫార్ములా కొరత వంటివి అమెరికన్ల ఇబ్బందులకు చిహ్నాలని పేర్కొన్నారు. వినియోగదారుల సెంటిమెంట్‌ గణనీయంగా దెబ్బతిని 2011 స్థాయి నాటికి చేరిందని వెల్లడించారు. అమెరికా వినిమయ వస్తువుల ధరలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌లో 8.3శాతం పెరిగాయన్నారు.

గోల్డ్‌మన్‌శాక్స్‌ ఆర్థిక వేత్తలు ఈ ఏడాది, వచ్చే ఏడాదికి అమెరికా వృద్ధిరేటును కుదించి అంచనాలు వెలువరించిన రోజే లాయిడ్‌ వ్యాఖ్యలు బయటకు రావడం గమనార్హం. ఈ సంస్థ ఆర్థిక వేత్తల బృందానికి నాయకత్వం వహించిన జాన్‌ హాట్జుయస్‌ అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు 2.6శాతం నుంచి 2.4శాతానికి తగ్గవచ్చు. 2023 సంవత్సరానికి గానూ ఇది 2.2శాతం నుంచి 1.6శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. సప్లయ్‌ చైన్‌ వ్యవస్థ అమెరికా సరిహద్దుల పరిధిలో లేకపోవడం సమస్యాత్మకంగా మారిందని లాయిడ్‌ పేర్కొన్నారు. వాటిపై అమెరికా నియత్రణ లేదని వ్యాఖ్యానించారు. సెమీకండెక్టర్ల పరిశ్రమను తైవాన్‌ తిరిగి అమెరికాకు తీసుకురావాలని.. చైనా లక్ష్యాల్లో తైవాన్‌ కూడా ఉందని హెచ్చరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని