US inflation: అమెరికాలో భారీగా పెరిగిన ధరలు.. 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

గ్యాస్‌, ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులు, సేవల ధరలు గణనీయంగా పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది.....

Published : 11 Jun 2022 22:22 IST

వాషింగ్టన్‌: గ్యాస్‌, ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులు, సేవల ధరలు గణనీయంగా పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. వార్షిక ప్రాతిపదికన మే నెలలో ధరలు 8.6 శాతం పెరిగినట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 1981 తర్వాత ఈ స్థాయిలో ధరలు ఎగబాకడం ఇదే తొలిసారి. దీంతో వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడరల్‌ రిజర్వు మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నెలవారీగా చూస్తే ఏప్రిల్‌ నుంచి మే వరకు ధరలు ఒక శాతం పెరిగాయి. అదే మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు 0.3 శాతం ఎగబాకాయి. కొత్త, పాత కార్లు, రెస్టారెంట్‌ బిల్లులు, విమాన టికెట్లు.. ఇలా ప్రతి రంగంలో ధరలు ఎగబాకాయి. కేవలం ఇంధన, వస్తువుల ధరలేగాక ధరల పెరుగుదల అన్ని రంగాలకూ విస్తరించినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మూలంగా తలెత్తిన సరఫరా వ్యవస్థలోని ఇబ్బందుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను మరింత వేగంగా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రుణాలు భారమై ఆర్థిక మాంద్యానికీ దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్యాస్‌ ధరలు ఒక్క మే నెలలో 4 శాతం పెరిగాయి. దీంతో ఏడాది వ్యవధిలో గ్యాస్‌ ధరలు 50 శాతం పెరిగినట్లయింది. క్రితం నెలతో పోలిస్తే మేలో నిత్యావసరాల ధరలు 12 శాతం పెరిగాయి. రెస్టారెంట్‌లో బిల్లులు 7.4 శాతం మేర ఎగబాకాయి. అద్దెలు, హోటల్‌ రెంట్లు, కొత్త ఇంటి కొనుగోలుకయ్యే ఖర్చును అంచనా వేసే ‘షెల్టర్‌ ఇండెక్స్‌’ 5.5 శాతం పెరిగింది. విమాన టికెట్ల ధరలు 38 శాతం ప్రియమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని