US Inflation: అమెరికాలో 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

అమెరికాలో జనవరి ద్రవ్యోల్బణం (Inflation) 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది......

Published : 11 Feb 2022 11:08 IST

వాషింగ్టన్‌: అమెరికాలో జనవరి నెల ద్రవ్యోల్బణం (Inflation) 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. నిత్యావసరాల ధరల పెరుగుదలను సూచించే ‘కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌’ (CPI) క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.5 శాతం మేర ఎగబాకింది. ఫిబ్రవరి, 1982 తర్వాత ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. ఇక గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే ద్రవ్యోల్బణం 0.6 శాతం పెరిగింది.

కొవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకుంటున్న అమెరికాలో డిమాండ్‌ పుంజుకుంది. మరోవైపు సంక్షోభం వల్ల సరఫరా గొలుసు, ఉత్పత్తిలో తలెత్తిన ఇబ్బందులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆహారం, విద్యుత్తు, నివాస ఖర్చులు భారీగా ఎగబాకడమే ద్రవ్యోల్బణ పెరుగుదలకు ప్రధాన కారణం. క్రితం ఏడాదితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు 0.5 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో ఇంధన ధరలు 0.9 శాతం వరకు ఎగబాకాయి.

నిరంతరం హెచ్చుతగ్గులు ఉండే ఆహారం, ఇంధన ధరల్ని తొలగిస్తే ఇతర నిత్యావసరాల ధరలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగాయి. వినియోగించిన కార్ల ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్బణం ఎగబాకడానికి ఓ కారణం. క్రితం ఏడాదితో పోలిస్తే వీటి ధరలు 40.5 శాతం వరకు పెరిగాయి. ఇళ్ల ధరలు 4.4 శాతం మేర ఎగబాకాయి.

ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్లను పెంచనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మార్చి నుంచే రేట్ల పెంపు ఉండనున్నట్లు తెలిపింది. తద్వారా ద్రవ్యలభ్యత తగ్గి డిమాండ్‌ కిందకు వస్తుందని అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల జో బైడెన్‌ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, ఉద్యోగ కల్పన ఆశించిన స్థాయికి చేరినప్పటికీ.. నిత్యావసరాలైన గ్యాస్‌, ఆహారం, నివాస ధరలు పెరగడంతో ఆయన పాలనపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని