Google: గూగుల్‌కు అమెరికాలోనూ భారత్‌ తరహా చిక్కులు!

Google: ప్రకటనల విషయంలో గూగుల్‌ అనుసరిస్తున్న విధానాలను అమెరికా ప్రభుత్వం కోర్టులో సవాల్‌ చేసింది.

Updated : 25 Jan 2023 15:17 IST

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్‌ (Google)కు అమెరికాలోనూ చిక్కులు మొదలయ్యాయి. భారత్‌ తరహాలోనే అమెరికా ప్రభుత్వం సైతం గూగుల్‌ ఆన్‌లైన్‌ యాడ్‌ మార్కెట్‌ విధానాలను తప్పుబట్టింది. ఈ మేరకు ఎనిమిది రాష్ట్రాలతో కలిసి అక్కడి కేంద్ర ప్రభుత్వ న్యాయ విభాగం కోర్టులో దావా వేసింది.

ఆన్‌లైన్‌ యాడ్‌ మార్కెట్‌లో ప్రత్యర్థులను తొలగించేందుకు గూగుల్‌ (Google) ప్రయత్నిస్తోందని ప్రభుత్వం దావాలో ఆరోపించింది. పోటీ సంస్థల్ని కొనుగోలు చేయడం లేదా వారి ఉత్పత్తులను వినియోగించే ప్రక్రియను కస్టమర్లకు కష్టతరం చేయడం ద్వారా గూగుల్‌ (Google) తమ బాధ్యతాయుతమైన పాత్రను దుర్వినియోగం చేస్తోందని పేర్కొంది. గత దశాబ్దంన్నర కాలంగా హద్దులేని వృద్ధిని సాధించిన టెక్‌ కంపెనీల గుత్తాధిపత్యాన్ని నియంత్రించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు అనుసరిస్తున్న విధానంలో భాగంగానే గూగుల్‌పై తాజా చర్యలకు ఉపక్రమించింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలపైనే ఆధారపడి ఉందని అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లాండ్‌ అన్నారు. కానీ, గూగుల్‌ గుత్తాధిపత్యం వల్ల అది దెబ్బతింటోందని వాపోయారు. ఇలాంటి లోపభూయిష్ఠ విధానాలు ఆవిష్కరణలను అణచివేస్తాయన్నారు. అధిక ధరలు ఉత్పత్తిదారులు, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తాయని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా గూగుల్‌ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ఫలితంగా ప్రత్యర్థి టెక్నాలజీల పురోగతిని నిలువరించిందని తెలిపారు. ప్రకటనదారులు, పబ్లిషర్లు తమ ఉత్పత్తులు మాత్రమే వినియోగించేలా ఆన్‌లైన్‌ విధానాలను తారుమారు చేసిందని ఆరోపించారు.    

భారత్‌లోనూ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పరికరాలకు సంబంధించి, తన ఆధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని, పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ సీసీఐ రూ.1,337 కోట్ల అపరాధ రుసుము విధించిన విషయం తెలిసిందే. దీనిపై గూగుల్‌ ఎన్‌సీఎల్‌ఏటీను ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ప్రతికూల తీర్పు వెలువడింది. అపరాధ రుసుముపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని