Credit Card: క్రెడిట్‌ కార్డుతో కోట్లు సంపాదించాడు!

క్రెడిట్‌ కార్డు ఉంది కదా అని.. చాలామంది అవసరమున్నా లేకున్నా కొనుగోళ్లు చేస్తుంటారు. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టలేక అప్పుల్లో కూరుకుపోతుంటారు.

Published : 02 Jun 2021 21:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ కార్డు ఉంది కదా అని.. చాలామంది అవసరమున్నా లేకున్నా కొనుగోళ్లు చేస్తుంటారు. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టలేక అప్పుల్లో కూరుకుపోతుంటారు. అందుకే ఆర్థిక నిపుణులు క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని ఎంత వీలైతే అంత తగ్గించాలని, అవసరానికి మించి వాడితే అప్పులపాలు అవుతారని హెచ్చరిస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కొన్నేళ్లుగా క్రెడిట్‌ కార్డును తెలివిగా ఉపయోగిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. అదెలా అంటారా.. అయితే చదివేయండి..

అమెరికాలో నివసిస్తున్న కాన్స్‌టాంటిన్‌ అనికీవ్‌ ఓ ఫిజిసిస్ట్‌. దీంతో ఆయనకు సులభంగానే క్రెడిట్‌ కార్డు లభించింది. అయితే దాన్ని అందరిలా అవసరానికి ఉపయోగపడే డబ్బుగా చూడలేదు. పెట్టుబడిగా వాడుకున్నాడు. క్రెడిట్‌ కార్డుతో నిత్యం పలు గిఫ్ట్‌కార్డులు కొనుగోలు చేసేవాడు. వాటికి రివార్డులు వచ్చేవి. గిఫ్ట్‌కార్డులను, రివార్డులను తిరిగి నగదుగా మార్చుకొని బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకునేవాడు. ఉదాహరణకు 1000 డాలర్లు పెట్టి గిఫ్ట్‌కార్డు కొనుగోలు చేస్తే దానికి 50డాలర్ల రివార్డు వచ్చేది. గిఫ్‌కార్డును నగదుగా మార్చుకునేందుకు 12 డాలర్లు ఫీజు కింద పోయినా, మిగతా 38 డాలర్లు లాభం దక్కేది. బ్యాంకులో జమ చేసిన డబ్బుతో క్రెడిట్‌కార్డు బిల్లు కట్టేసేవాడు. క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నందుకు ఆయా బ్యాంకులు సైతం పలు క్యాష్‌బ్యాక్‌, రాయితీలు ఇచ్చేవి. ఇదే ట్రిక్‌ను 2009 నుంచి కొనసాగిస్తూ వస్తున్నాడట. దీంతో ఇప్పటి వరకు క్రెడిట్‌ కార్డు సాయంతో కాన్స్‌టాంటిన్‌ 3లక్షల డాలర్లు (రూ.2.19 కోట్లు) సంపాదించాడు. 

అయితే కాన్స్‌టాంటిన్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుండటం గమనించి ఇటీవల కొందరు ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారట. దీంతో అతడి ఆదాయంపై అధికారులు విచారణ జరిపించారు. కోర్టులో విచారణ సందర్భంగా కాన్స్‌టాంటిన్‌ తన వద్ద పెద్దమొత్తంలో ఉన్న గిఫ్ట్‌కార్డులను చూపించాడు. వాటి ద్వారా వచ్చే రివార్డులు, బ్యాంకుల క్యాష్‌బ్యాక్‌తోనే తనకు డబ్బులు వస్తున్నాయని చెప్పాడు. అది తన ఆదాయం కాదని వాదించాడు. కాగా.. క్రెడిట్‌కార్డు ద్వారా వచ్చే రివార్డులు ఆదాయపు పన్ను కిందకు రావు. కానీ గిఫ్ట్‌కార్డు.. వాటిపై వచ్చే రివార్డులు నగదు రూపంలోకి మార్చుకున్నప్పుడు కచ్చితంగా ఆదాయం కిందకే వస్తుందని, వాటిపై పన్ను విధించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అధికారులు కాన్స్‌టాంటిన్‌ ఆదాయంపై పన్ను వసూలు చేసే పనిలో పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని