Russian Oil: భారత్‌పై ఆంక్షలు విధించబోం.. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా

Russian Oil: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని చెప్పింది.

Updated : 09 Feb 2023 13:25 IST

దిల్లీ: రష్యా (Russia) నుంచి చమురు దిగుమతుల్ని (Oil Imports) భారత్‌ గణనీయంగా పెంచుకుంటోంది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం (Russia-Ukraine War) నేపథ్యంలో ఆయా దేశాలు రష్యా చమురు (Russian Oil)పై విధించిన ఆంక్షల్ని భారత్‌ అవకాశంగా మార్చుకుంది. పలు దేశాల నుంచి వ్యక్తమైన విమర్శలకు స్వతంత్ర విదేశాంగ విధానంతో గట్టిగా బదులిస్తోంది. తాజాగా అమెరికా ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇబ్బందేమీ లేదు..

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. భారత్‌పై ఆంక్షలు విధించే ఆలోచనేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖలో ఐరోపా, యురేషియా వ్యవహారాలను పర్యవేక్షించే అసిస్టెంట్‌ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ కరెన్‌ డాన్‌ఫ్రైడ్‌ బుధవారం విలేకరులతో చెప్పారు. భారత్‌- అమెరికా మధ్య సంబంధాలు చాలా బలమైనవని తెలిపారు. ఉక్రెయిన్‌ ప్రజలకు భారత్‌ అందిస్తున్న మానవతా సాయాన్ని డాన్‌ఫ్రైడ్‌ కొనియాడారు. ఇది యుద్ధాలకు సమయం కాదని.. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ హితవును సైతం స్వాగతిస్తున్నామన్నారు.

అందుకే ఆంక్షలు విధించబోం..

మాస్కో నుంచి న్యూదిల్లీ చమురు కొనుగోళ్లపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ దశాబ్దం చివరికల్లా రష్యా చమురు (Russian Oil), గ్యాస్‌ 50 శాతానికి తగ్గిపోతుందని డాన్‌ఫ్రైడ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలపై ప్రత్యేక ఆంక్షల వల్ల అంతర్జాతీయంగా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని తెలిపారు. అందుకే రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రష్యా చమురు (Russian Oil)పై విధించిన ఆంక్షల ఫలితం ఇప్పటికే కనిపిస్తోందన్నారు. ఆ దేశ బడ్జెట్‌లో లోటు ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు.

రష్యా నుంచే 28 శాతం..

రష్యా (Russia) నుంచి మన దేశానికి ముడిచమురు దిగుమతులు (Oil Imports) అంతకంతకూ పెరుగుతున్నాయి. జనవరి నెలలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి. ఒకప్పుడు ఒక శాతం కూడా లేని దిగుమతులు ఇప్పుడు ఏకంగా 28 శాతానికి చేరినట్లు ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వొర్టెక్సా ఇటీవల వెల్లడించింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ముందు రష్యా (Russia) నుంచి మన క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పశ్చిమ దేశాలు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆదాయం కోసం ముడి చమురును రాయితీ ధరకే ఆ దేశం అందిస్తోంది. దీంతో చైనా, భారత్‌ ఆ దేశం నుంచి తక్కువ ధరకే ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జనవరిలో రష్యా ముడి చమురు వాటా 28 శాతానికి చేరింది. డిసెంబర్‌లో ఈ వాటా 26 శాతంగా ఉంది. రష్యా తర్వాత ఇరాక్‌ (20 శాతం), సౌదీ అరేబియా (17 శాతం), అమెరికా (9 శాతం), యూఏఈ (8 శాతం) అత్యధికంగా మన దేశానికి చమురును సరఫరా చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు