Published : 01 Aug 2022 15:43 IST

Usa recession: అమెరికాది విచిత్ర పరిస్థితి..!

మాంద్యంలో ఉన్నట్టా.. లేనట్టా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉందా..? అనే ప్రశ్నకు సమాధానం కోసం అక్కడి ఆర్థికవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు మాంద్యంలోనే ఉందంటే.. మరికొందరు త్వరలో మాంద్యంలోకి జారుకొంటుందని చెబుతున్నారు. పాలకులు మాత్రం ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని చెప్పేందుకు బలమైన జాబ్‌మార్కెట్‌ను ఆధారంగా చూపిస్తున్నారు. సాధారణంగా రెండు వరుస త్రైమాసికాలు ఆర్థిక వ్యవస్థ కుంగితే దానిని మాంద్యంగా పిలుస్తారు. అమెరికాలో గత 10 ఆర్థిక మాంద్యాల్లో 10 సార్లూ వరుసగా ఆర్థిక వ్యవస్థ రెండు త్రైమాసికాలు కుంగింది. అప్పుడే మాంద్యంగా ప్రకటించారు. వాటిల్లో చివరి ఏడు మాంద్యాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేకపోవడం విశేషం.  ముఖ్యంగా అమెరికాలో మాంద్యం వస్తే మనకు ఏమవుతుందిలే అనుకోవడానికి లేదు.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగిస్తే మన ఎగుమతిదారులకు ఆర్డర్లు లభించవు. ఇక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల లాభాల్లో కూడా గతంలో వలే భారీ ఆదాయం కనిపించే అవకాశం ఉండదు.  

వాస్తవానికి అమెరికాలో ఆర్థిక మాంద్యాన్ని నిర్వచించేందుకు కచ్చితమైన నిబంధనలు లేవు. ‘నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చి’ కింద పనిచేసే ‘బిజినెస్‌ సైకిల్‌ డేటింగ్‌ కమిటీ’ అనే సంస్థ దీనిని ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి ఆ సంస్థ ‘మాంద్యం’ అనే పదం వాడలేదు. కానీ, చాలా సూచీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితిని మాత్రం తెలియజేస్తున్నాయి. 

కంపెనీల కార్యకలాపాలు..

ఆర్థిక వ్యవస్థల హెచ్చుతగ్గుల్లో కంపెనీల కార్యకలాపాలు కీలకపాత్ర పోషిస్తాయి. కంపెనీల ఇన్వెంటరీల పెరుగుదల తగ్గడంతో ఆర్థికంగా తీవ్రమైన ప్రతికూల సంకేతాలు గత త్రైమాసికంలో కనిపించాయి. గతేడాది కొవిడ్‌ కారణంగా సప్లైఛైన్లలో ఇబ్బందులను, కొవిడ్‌ తర్వాత డిమాండ్‌ పెరుగుతుందని భావించి అధిక స్టాక్‌లను కంపెనీలు నిల్వ చేశాయి. ఇప్పుడవే వోవర్‌ స్టాక్‌ అయి కూర్చొని ఉండొచ్చని భావిస్తున్నారు. 

వాస్తవానికి అమెరికా జీడీపీ 0.9శాతానికి తగ్గింది. అదే సమయంలో ఇన్వెంటరీల్లో మందగమనం కారణంగా ఉత్పాదకతలో 2 పాయింట్లు తగ్గాయి. అంటే.. కంపెనీలు ఇన్వెంటరీలను తగ్గించుకోకపోతే ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించే అవకాశం ఉంది. కన్జ్యూమర్‌ డిమాండ్‌ బలహీనంగా ఉండటం కూడా మాంద్యానికి చిహ్నమే.

ఉద్యోగ మార్కెట్‌ బలంగా..

అమెరికా ఉద్యోగ మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకు బలమైన అండగా నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని తప్పించుకోగలదని వాదించేవారందరికి ఇదే ప్రధాన ఆధారంగా మారింది. కరోనా కారణంగా కోల్పోయిన ఉద్యోగాల్లో జూన్‌ నాటికి 98శాతం మళ్లీ భర్తీలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. 2022లో అమెరికాలో నిరుద్యోగ రేటు అతి స్వల్పంగా ఉంది. జనవరి నుంచి ఆర్థిక వ్యవస్థలోకి 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి చేరాయి. మే నెలలో ప్రతి సరికొత్త అభ్యర్థికి రెండు ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ నెల లే ఆఫ్‌లు కూడా అత్యంత తక్కువగా నమోదయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆ నెలకు 4,00,000 ఉద్యోగాలను సృష్టించింది. ఈ పరిస్థితి సాధారణంగా ఆర్థిక మాంద్యంలో కనిపించదు.  

ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదల..

ఇక ద్రవ్యోల్బణం మాత్రం అమెరికాను గజగజలాడిస్తోంది. వినియోగదారుడి వద్ద ఉన్న వ్యయ శక్తి మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. జూన్‌ నాటికి 9.1శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు బ్యూరో ఆఫ్‌ లేబర్‌ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్థ లెక్కల ప్రకారం అమెరికా ప్రజల పొదుపులు కూడా గతేడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయాయి. అంటే.. వారు డబ్బుకు కటకటలాడతున్నట్లే లెక్క.  మేలో వారు పన్నులు పోను మిగిలిన ఆదాయంలో 5.4శాతం మాత్రమే పొదుపు చేసినట్లు తేలింది. గతేడాది ఇది 12.4శాతంగా ఉంది. ఉద్యోగాలు పెరిగినా.. కొనుగోలుశక్తి పెరగకపోవడం ఇక్కడ గమనార్హం.  

మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఫెడ్‌ వడ్డీ రేట్లను ఈ ఏడాది చివరి  నాటికి 3.4శాతానికి చేర్చవచ్చని ముందస్తుగానే ప్రకటించింది. అధిక ధరలు ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థను మందగింపజేస్తే ఫలితం ఉంటుందని భావిస్తోంది.

వినియోగదారుల వినిమయ శక్తి, సెంటిమెంట్‌..

అమెరికా ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల వ్యయందే అతిపెద్దభాగం. మే నెలతో పోల్చుకొంటే వినియోగదారుల వ్యయం 1.1శాతం పెరిగిందని అమెరికాలోని కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ గణంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన ధరల కారణంగా సంభవించి ఉండొచ్చని అంచనావేస్తున్నారు. 

మరో వైపు ఆర్థిక వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం కూడా సన్నగిల్లింది. వరుసగా మూడో నెల కూడా ఇక్కడ వినియోగదారుల విశ్వాస సూచిక కుంగింది. దీనికి స్పందించిన వారిలో 43శాతం మంది వచ్చే ఏడాది మాంద్యం వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు బాండ్‌ మార్కెట్‌లో ఇన్వెర్టెడ్‌ ఈల్డ్‌కర్వ్‌ (స్వల్పకాల బాండ్ల ఈల్డ్‌లు దీర్ఘకాలిక బాండ్ల ఈల్డ్‌లను మించి ఉండటం) కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత 60 ఏళ్లలో అమెరికా ట్రెజరీ నోట్లలో ఇన్వెర్ట్‌డ్‌ ఈల్డ్‌కర్వ్‌ కనిపించిన ప్రతిసారి మాంద్యం వచ్చింది.  పెట్టుబడిదారుల్లో సమీప భవిష్యత్తుపై ఆందోళనను ఇది ప్రతిఫలిస్తుంది. అందుకే స్వల్పశ్రేణి బాండ్ల వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని