Emergency Fund: అత్యవసర నిధి ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది?

అనుకోని ఖర్చుల కోసం అత్యవసర నిధి ఎలా సహాయపడుతుంది అనేది ఇక్కడ చూద్దాం.

Published : 10 Apr 2023 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల అన్ని రకాల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి ఖర్చులు అదనంగా వస్తాయో, ఉపాధి పరంగా ఎలాంటి సమస్యలు ఏర్పడతాయో ఊహించడం కష్టం. అదే జరిగితే కుటుంబం మొత్తం ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు, చిన్నతరహ వ్యాపారం/వృత్తులు చేసేవారికి ఇలాంటి అత్యవసర ఖర్చులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెడతాయి. అయితే, ఇలాంటి ఊహించని ఖర్చుల నుంచి రక్షించుకోవడానికి ‘అత్యవసర నిధి’ (Emergency Fund) ఏర్పరచుకుంటే విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చు. చాలా మంది అత్యవసర నిధి.. ఉపాధి కోల్పోయినప్పుడే పనికొస్తుందని అనుకుంటారు. కానీ, అనేక ఇతర రకాల ఊహించని ఖర్చులు కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడూ అత్యవసర నిధిని ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

ఇంటి నిర్వహణ

సొంత ఇంటి నిర్మాణం అయిన కొంతకాలం తర్వాత ఇంటికి రిపేర్‌లు వస్తుంటాయి. త్వరగా మరమ్మతులు చేయించకుంటే ఇల్లు మరింత డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు ఇంటి పైకప్పు లీకైనా, ఇంటి డ్రైనేజీలు దెబ్దతిన్నా, ఇంటిలో ముఖ్యమైన ఫర్నీచర్‌ డ్యామేజ్‌ అయినా.. ఇలాంటి ఇంటికి సంబంధించిన ఖర్చులను భరించడానికి అత్యవసర నిధి సహాయపడుతుంది. ఇలాంటి ఖర్చుల కోసం కొంతమంది స్వల్పకాలిక రుణాలు తీసుకుంటారు. కానీ, మీ అత్యవసర నిధి సరిపోతే రుణం తీసుకోవలసిన అవసరం లేదు. దీనివల్ల ఈఎంఐ భారం కూడా ఉండదు. ప్రమాదాల కారణంగా గృహ బీమా పాలసీ ద్వారా క్లెయిమ్‌ ఫైల్‌ చేయవలసి వస్తే, మీరు మినహాయించిన మొత్తాన్ని చెల్లించవలసి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అత్యవసర నిధి ఉపయోగపడుతుంది.

ప్రయాణాలు

ఎవరి కుటుంబంలోనైనా ఒక్కోసారి ఊహించని సంఘటనలు (మన బంధువుల్లో ఎవరికైనా అనారోగ్యం, ప్రమాదాలు) జరుగుతుంటాయి. అలాంటప్పుడు అత్యవసరంగా విమాన ప్రయాణాలు లాంటివి చేయవలసి ఉంటుంది. లేదంటే రైలు రిజర్వేషన్‌ సౌకర్యం వెంటనే వీలు కాకపోవడం వల్ల ఏదైనా ప్రైవేట్‌ వాహనాల్లో భారీగా ఖర్చు పెట్టి ప్రయాణం చేయవలసి ఉంటుంది. గమ్యస్థానానికి చేరిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి కూడా డబ్బులు అవసరం పడొచ్చు. ఇలాంటి ఊహించని/అనుకోని ఖర్చులను తట్టుకోవడానికి అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు.

లీగల్‌ వ్యవహారాలు

ఒక వ్యక్తి లేక కుటుంబం చట్టపరమైన వివాదాన్ని ఎదుర్కొనే సమయంలో అనేక న్యాయపరమైన (రుసుముల) ఖర్చులు ఉండొచ్చు. ఇలాంటి ఖర్చులను భరించడానికి అత్యవసర నిధిని ఉపయోగించవచ్చు. ఉదా: బెయిల్‌, పూచీకత్తు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి.

ఇంటి అద్దె

అద్దెకుండేవారు ఎక్కువ కాలం పాటు అద్దె చెల్లించకపోయినా, ఇల్లు ఖాళీ అయిన తర్వాత కొంత కాలం పాటు ఎవరూ అద్దెకు రాకపోయినా (ఇటువంటి పరిస్థితుల్లో కొత్త అద్దెదారు ఇంట్లోకి వచ్చే వరకు) అద్దెల మీద ఆధారపడే ఇంటి యజమానులు ఇబ్బందులు పడతారు. ఇటువంటి పరిస్థితులను తట్టుకునేందుకు కూడా అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు.

ఇతర ఖర్చులు

జీవితం అనూహ్యమైంది. ఊహించని ఖర్చులు ఎప్పుడైనా రావచ్చు. కుటుంబంలో వివాహ ఖర్చులు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వేడుకలు (మెచ్యూర్‌ ఫంక్షన్స్‌) ఖర్చులు ఊహించనివి. ఇలాంటి ఖర్చులను అత్యవసర నిధి ఉన్నవారు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా పూర్తి చేయొచ్చు.

చివరిగా: మీరు ఈ నిధిని తెలివిగా ఖర్చుపెట్టాలి. ఆహారం, విహారయాత్రలు, బట్టలు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల కొనుగోలు వంటి విషయాలకు ఈ డబ్బు ఖర్చు చేయకూడదు. రికరింగ్‌ డిపాజిట్లు, ఎఫ్‌డీలు, లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు వంటి లిక్విడ్‌ సాధనాల్లో మీ అత్యవసర నిధిని భద్రపరచుకోవచ్చు. ఇంకా అధిక వడ్డీ లభించే బ్యాంకు పొదుపు ఖాతాల్లో కూడా ఈ డబ్బును పొదుపు చేయొచ్చు. మీకు ఇతర ఆదాయ వనరులు లేనప్పుడు అత్యవసర నిధిని ముందు నుంచి తగినంత సమకూర్చుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు