ChatGPT: ఆ యూనివర్సిటీలో చాట్‌జీపీటీపై నిషేధం.. వాడితే శిక్ష తప్పదు!

ChatGPT: చాట్‌జీపీటీ వాడకంపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్థలు దీని వాడకాన్ని నిషేధిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ చేరింది.

Published : 22 Feb 2023 14:25 IST

హాంకాంగ్‌: టెక్‌ వర్గాల్లో ఇప్పుడు చాట్‌జీపీటీ (ChatGPT) ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా ఇది విద్యార్థుల చేతుల్లోకి వెళ్లడం వల్ల వారి అభ్యసన సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే బెంగళూరులోని ఆర్‌వీ విశ్వవిద్యాలయం, న్యూయార్క్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ చాట్‌జీపీటీ (ChatGPT) వాడకాన్ని నిషేధించాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ (HKU) సైతం చాట్‌జీపీటీ సహా కృత్రిమ మేధ ఆధారిత టూల్స్‌ను వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు అసైన్‌మెంట్లు సహా ఇతర ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రొఫెసర్లు కూడా బోధనలో వీటిని వాడొద్దని ఆదేశించింది.

ప్రొఫెసర్ల అనుమతి లేకుండా చాట్‌జీపీటీ ఉపయోగించి అసైన్‌మెంట్‌ పూర్తి చేసిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్‌కేయూకు చెందిన టీచింగ్‌ ఇన్‌ఛార్జ్‌ హీ లిరెన్‌ తెలిపారు. దీన్ని ప్లేజరిజం (Plagiarism)గానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఏఐ టూల్స్‌ ఉపయోగించినట్లు అనుమానం వస్తే మౌఖిక పరీక్ష తీసుకోవడం వంటి మార్గాల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని టీచర్‌ నిర్ధారించుకోవచ్చని తెలిపారు. అయితే, భవిష్యత్‌లో ఏఐకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి దీనిపై మరింత చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇవి విద్యాసంస్థలకు ఎలా ఉపయోగపడతాయి? దీన్ని సమర్థంగా ఎలా అమలు చేయాలి? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని