విహార యాత్రకు ముందస్తు ప్రణాళిక

విహార‌యాత్ర‌కు ఖ‌ర్చ‌య్యే బ‌డ్జెట్ లెక్క‌లు ముందుగా వేసుకోవ‌డం మంచిది.

Updated : 17 Nov 2021 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌పంచవ్యాప్తంగా కొన్ని దేశాలు త‌ప్పించి కొవిడ్ సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో విదేశీ ప్ర‌యాణాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సెలవుల‌ను ఆస్వాదించ‌డానికి విహార యాత్ర‌ల‌ను ప్లాన్ చేస్తున్నారు చాలా మంది. అయితే కొవిడ్ ప‌రిస్థితులు పూర్తిగా ముగియ‌లేదు కాబ‌ట్టి కొవిడ్‌కు సంబంధించిన త‌గిన ప్రోటోకాల్‌లు అన్ని దేశాల్లో అనుసరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంత‌ర్జాతీయంగా ఏ వ్యాక్సిన్ ఏయే దేశాలు ఆమోదించాయో తెలుసుకుని ఆ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారా? లేదా అని నిర్ధారించుకోవాలి. అన్నింటిక‌న్నా విహార‌యాత్ర‌కు ఖ‌ర్చ‌య్యే బ‌డ్జెట్ లెక్క‌లు ముందుగా వేసుకోవ‌డం మంచిది.

1) బ‌య‌టి ప్రాంతాల‌కు వెళ్లిన‌పుడు ఎప్పుడూ మ‌నం అనుకున్నంత బ‌డ్జెట్లో అన్ని ప‌నులు అయిపోవు. కానీ ముందుగా మ‌నం వెళ్లే ప్రాంతాల‌ను బ‌ట్టి బ‌డ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటే అధిక ఖ‌ర్చుల‌ను నివారించ‌వ‌చ్చు.

2) బ‌డ్జెట్‌ను సెట్ చేసేట‌పుడు, ప్ర‌స్తుతం ఉన్న పెట్టుబ‌డులు, పొదుపుల‌ను క‌ద‌లించ‌కూడ‌దు. బ‌డ్జెట్ ఖ‌రారు అయిన త‌ర్వాత దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌యాణం కొన‌సాగించాలి. మీరు సెట్ చేసుకున్న బ‌డ్జెట్‌కు స‌రిపోయేలా మీ ప్ర‌యాణ గ‌మ్యాన్ని, వ‌స‌తిని ఎంపిక చేసుకోవాలి.

3) మీ యాత్ర కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి. దీని వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మీ ట్రావెల్ ఫండ్ కోసం డ‌బ్బు ఆదా చేయ‌డం ప్రారంభించ‌వ‌చ్చు. ఇందులో మీ నెల‌వారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఈ ట్రిప్ కోసం కేటాయించ‌వ‌చ్చు. ముందుగా సిద్ద‌ప‌డ‌డం వ‌ల్ల మంచి డీల్స్‌, డిస్కౌంట్‌లు, ఆఫ‌ర్‌ల‌ను సంపాదించ‌గలుగుతారు. అలాగే త‌క్కువ ర‌ద్దీ ఉన్న స‌మ‌యాల్లో ప్రయాణించడం వల్ల మీరు చాలా డ‌బ్బును ఆదా చేసుకోగ‌ల‌గుతారు.

4) మీరు అంత‌ర్జాతీయ విహార యాత్ర‌ను ప్లాన్ చేస్తుంటే, ట్రావెల్ క‌రెన్సీని ముందుగానే కొనుగోలు చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. లేక‌పోతే విప‌రీత‌మైన మార‌క‌పు ధ‌ర‌ల‌ను వ‌సూలు చేసే ఫారిన్ ఎక్స్ఛేంజీ బ్యూరోల ద్వారా ఇబ్బందులకు గురికావ‌చ్చు. ఇది ప‌ర్య‌ట‌న‌లో మీ మొత్తం బ‌డ్జెట్‌ను తారుమారు చేస్తుంది. అందుచేత ఆర్థిక ప్ర‌ణాళిక‌తో పాటు, అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను నివారించ‌డానికి మీ ప‌ర్య‌ట‌న‌లో డ‌బ్బును సమర్థంగా నిర్వ‌హించాలి.

5) ప్ర‌యాణానికి ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్‌ను ఉప‌యోగించ‌డం మంచిది. ఇది త‌క్కువ ధ‌ర‌ల‌ను అందిస్తూ మార‌క‌పు ధ‌ర‌ల హెచ్చుత‌గ్గుల నుంచి మీ డ‌బ్బు ఆదా చేస్తుంది. క్రెడిట్‌, డెబిట్ కార్డులు, ట్రావెల‌ర్స్ చెక్‌లు, న‌గ‌దు వంటి వివిధ మార్గాల ద్వారా ఖ‌ర్చును విభ‌జించ‌డం మంచిది.

6) ఈ విహార యాత్ర‌ల ప్ర‌యాణాల్లో క్రెడిట్ కార్డ్‌ల మీద‌ అనేక రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉంటే మీ ట్రిప్ బుక్ చేసేట‌పుడు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం మంచిది.

7) మీ ప్ర‌యాణానికి త‌గినంత డ‌బ్బు స‌ర్దుబాటు అవ్వ‌క‌పోతే ఖ‌ర్చులకు గాను వ్య‌క్తిగ‌త రుణాన్ని కూడా తీసుకోవ‌చ్చు. అయితే ఈ ఈఎంఐలను గ‌డువు తేదీకి చెల్లించ గ‌లిగి ఉండాలి. ఇటువంటి వ్య‌క్తిగ‌త రుణాలు సాధార‌ణంగా అధిక వ‌డ్డీ రేట్ల‌ను క‌లిగి ఉంటాయి. కాబ‌ట్టి మీరు త్వ‌ర‌గా చెల్లించ‌గ‌లిగే త‌క్కువ కాల వ్య‌వ‌ధి రుణాల‌ను ఎంచుకోవాలి. వీలైనంత వరకు వ్యక్తిగత రుణం తీసుకోవడం కంటే యాత్రల కోసం ముందుగానే పొదుపు ఆరంభించడం మంచిది.

చివ‌రగా..: విహార యాత్ర‌ల‌కు ప్లాన్ చేస్తున్న‌వారు ముందుగానే ప్లాన్ చేయ‌డం వల్ల త‌గిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకునేందుకు స‌మ‌యం దొరుకుతుంది. ఇలాంటి వాటి కోసం అప్పు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. విహార యాత్ర‌ల‌కు వెళ్లిన‌న్ని రోజులు ఆదాయం ఉండ‌దు కాబ‌ట్టి రెగ్యుల‌ర్‌గా చేసే పెట్టుబ‌డులు, చెల్లించాల్సిన రుణాలు ఆగ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని