Varroc Engineering: 52వారాల గరిష్ఠాన్ని తాకిన వెరాక్‌ షేర్లు.. కారణమేంటంటే

ఔరంగాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ వెరాక్‌ ఇంజినీరింగ్‌ (Varroc Engineering) తమ ఫోర్‌-వీలర్‌ లైటింగ్‌ వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘కంపెనీ ప్లాస్టిక్‌ ఓమ్నియం’ (Compagnie Plastic Omnium)కు విక్రయించింది....

Updated : 24 Nov 2022 14:37 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఔరంగాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ ‘వెరాక్‌ ఇంజినీరింగ్‌’ (Varroc Engineering) తమ ఫోర్‌-వీలర్‌ లైటింగ్‌ వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘ప్లాస్టిక్‌ ఓమ్నియం’ (Compagnie Plastic Omnium)కు విక్రయించింది. ఈ ఒప్పంద విలువ 600 మిలియన్‌ యూరోలు (దాదాపు రూ.48.31 వేల కోట్లు). ఫలితంగా యూఎస్‌ఏ, మెక్సికో, బ్రెజిల్‌, పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, జర్మనీ, టర్కీ, మొరాకోలోని లైటింగ్‌ వ్యాపార కార్యకలాపాల నుంచి వెరాక్‌ (Varroc Engineering) తప్పుకోనుంది. ఈ నేపథ్యంలో వెరాక్‌ షేర్లు ఈరోజు భారీగా లాభపడి రూ.493.85 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి.

ఇకపై తాము విద్యుత్తు వాహనాలు, ఉన్నత సాంకేతిక ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారాలపై దృష్టి సారించనున్నట్లు వెరాక్‌ (Varroc Engineering) ఛైర్మన్‌, ఎండీ తరంగ్‌ జైన్‌ తెలిపారు. అమెరికా, ఐరోపాలోని లైటింగ్‌ బిజినెస్‌ నుంచి తాము నిష్క్రమించడం వల్ల వెరాక్‌తో పాటు ప్లాస్టిక్‌ ఓమ్నియంకు లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ వాటాదారులు, ఉద్యోగులు, వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

తాజా ఒప్పందం నుంచి సమకూరనున్న నిధులతో వెరాక్‌ రుణాలు తీరిపోనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా కంపెనీకి కేవలం భారత కార్యకలాపాలపైనే దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. లైటింగ్‌ సిస్టమ్స్‌ నుంచి వైదొలగడంతో కంపెనీ వ్యాపారాల్లో వాహన తయారీ పరిశ్రమకు అందించే పాలిమర్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ సరఫరా మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆయిల్ అండ్‌ గ్యాస్‌ ఇండస్ట్రీస్‌కు ఈ కంపెనీ హాట్‌ స్టీల్‌ పోర్జ్‌డ్‌ పార్ట్స్‌ కూడా విక్రయిస్తోంది. అలాగే చైనా, ఇటలీ, వియత్నాం, పోలండ్‌, రొమేనియాలో అక్కడి సంయుక్త భాగస్వాములతో వివిధ వ్యాపారాలు కొనసాగించనుంది. ఈ కంపెనీకి డిసెంబరు 2021 నాటికి రూ.2,604 కోట్ల రుణాలు ఉన్నాయి.

ప్లాస్టిక్‌ ఓమ్నియం వివిధ వాహన విడిభాగాలను విక్రయించడంలో ఐరోపా, అమెరికా మార్కెట్లలో ఓ ప్రముఖ సంస్థగా కొనసాగుతోంది. స్మార్ట్‌ ఫేస్‌ బంపర్లు, టెయిల్‌గేట్‌, స్పాయిలర్లు, లిడ్‌ మాడ్యూల్‌ వంటి విడిభాగాలను అందిస్తోంది. ఇప్పుడు దీంట్లో లైటింగ్‌ వ్యవస్థ కూడా చేరింది. ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద కస్టమర్‌ ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూపు. సంస్థ ఆదాయంలో 26 శాతం ఫోక్స్‌వ్యాగన్‌ నుంచే వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని