రుణ భారం తగ్గించుకున్న వేదాంతా.. 100 మిలియన్‌ డాలర్ల చెల్లింపు

Vedanta Loan repayment: వేదాంతా రిసోర్సెస్‌ తన రుణ భారాన్ని మరింత తగ్గించుకుంది. స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాన్ని చెల్లించి తనఖా షేర్లను విడిపించుకుంది.

Published : 15 Mar 2023 15:45 IST

దిల్లీ: అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా రిసోర్సెస్‌ (Vedanta) తన రుణ భారాన్ని తగ్గించుకుంది. సింగపూర్‌కు చెందిన స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌కు 100 మిలియన్‌ డాలర్ల రుణాన్ని (Loan Repayment) తిరిగి చెల్లించినట్లు తెలిపింది. మార్చి 10నే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సమాచారం ఇచ్చింది. వేదాంతా రిసోర్సెస్ ఆర్థిక పరిస్థితిపై మదుపరుల్లో నెలకొన్న భయాల నేపథ్యంలో ఈ రుణ చెల్లింపు చేయడం గమనార్హం. 

2022 సెప్టెంబర్‌ 9న వేదాంతా రిసోర్సెస్‌కు చెందిన ట్విన్‌ స్టార్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుంది. వేదంతా రిసోర్సెస్‌ లిమిటెడ్‌, వెల్టర్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌ ఈ రుణానికి గ్యారెంటేటర్లుగా వ్యవహరించాయి. ఇందుకోసం షేర్లను తనఖా పెట్టారు. ఈ మొత్తాన్ని తాజాగా తిరిగి చెల్లించడం ద్వారా తన షేర్లను వేదాంతా విడిపించుకుంది. గడిచిన 11 నెలల్లో సుమారు 2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని వేదాంతా రిసోర్సెస్‌ తిరిగి చెల్లించింది. 2023 జూన్‌తో ముగిసే రెండో త్రైమాసికం వరకు నిధుల సమీకరించుకోగలమని ధీమా వ్యక్తంచేసింది.

వేదాంతా రిసోర్సెస్‌ అప్పుట్లో కూరుకుపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తనకున్న రుణాలను గత కొన్ని నెలలుగా ఈ కంపెనీ క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. తద్వారా రుణాలను 7.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్ల)కు పరిమితం చేసుకుంది. 2023 సెప్టెంబరు వరకు ఈ సంస్థ చెల్లించాల్సిన రుణాలకు ఇబ్బందేమీ ఉండబోదనీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇంక్‌ ఇటీవల భిప్రాయపడింది. సెప్టెంబరు నుంచి 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ, బాండ్ల కోసం 150 కోట్ల డాలర్ల (సుమారు రూ.12,450 కోట్ల) నిధుల సమీకరణ కోసం అగర్వాల్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులే ఆందోళనకరమని తెలిపింది. దీంతో వేదంతా షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 100 మిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపు చేయడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని