Anil Agarwal: ‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్‌ భావోద్వేగ పోస్ట్‌

Anil Agarwal:  ఫాదర్స్‌డే సందర్భంగా వేదాంత వ్యవస్థాపకుడు అనిల్‌ అగర్వాల్‌ తన నాన్నను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘ఎక్స్‌’’ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

Updated : 16 Jun 2024 18:17 IST

Anil Agarwal | ఇంటర్నెట్‌డెస్క్‌: మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను పంచుకుంటూ నేర్చుకున్న పాఠాల్ని చెబుతాడు. ప్రతి అడుగులోనూ తోడుంటాడు. ఎటువంటి సమస్యలో చిక్కుకున్నా నేనున్నానంటూ భుజం తడుతాడు. ఎప్పుడు కింద పడినా చేయందిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నే రియల్‌ హీరో. ఇలా తన జీవితంలో నాన్న అందించిన సపోర్ట్‌ గురించి పంచుకున్నారు వేదాంత వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్‌ అనిల్ అగర్వాల్ (Anil Agarwal). 

కెరీర్‌ ప్రారంభ దశలో తన తండ్రి ఏవిధంగా సపోర్ట్‌ చేశాడో ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నారు అనిల్‌ అగర్వాల్‌. 'ఫాదర్స్‌డే' సందర్భంగా తండ్రి ద్వారకా ప్రసాద్ అగర్వాల్‌ నేర్పిన పాఠాన్ని ఫాలోవర్లతో పంచుకున్నారు. ‘‘వ్యాపార రంగంలో అడుగుపెడదామని ముంబయి వచ్చాను. మొదట్లో నేను చాలా కష్టాల్ని ఎదుర్కొన్నా. ఆ సమయంలో ఓ రోజు సాయంత్రం నాన్న వచ్చి బ్రేక్‌ తీసుకో అని సలహా ఇచ్చారు. కొన్ని రోజులు సెలవు తీసుకొని ఇంటికి వెళ్లమన్నారు. తర్వాత నాలో మనోధైర్యాన్ని పెంచాడు. ఆయన జీవనపోరాటం గురించి చెప్పడం ప్రారంభించాడు. అయినప్పటీకీ నాలో బాధ తగ్గలేదు. కానీ ఏదైనా సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఆయన ఎప్పుడూ ఓ విషయం చెప్పేవాడు. మాట్లాడటం అనేది ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. ప్రతి బంధానికి పునాది ఇదే అని చెప్పేవారు. ఇదే పాఠాన్నే పిల్లలకు నేర్పాను’’ అని అగర్వాల్‌ తెలిపారు.

నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే

‘‘జీవితాంతం తల్లిదండ్రులు మనతో ఉండకపోయినా వారి సంస్కారం, జీవిత పాఠాలు, వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ రోజు నా పిల్లలు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలుపుతుంటే మా నాన్నకు కృతజ్ఞతలు చెప్పాలనిపించింది’’ అని ఆనందంతో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. తన తండ్రితో దిగిన చిన్ననాటి ఫొటోను జత చేశారు. ఇదిలా ఉండగా.. 19 సంవత్సరాల వయసులో అనిల్ అగర్వాల్ వ్యాపారం కోసం పట్నాను వదిలి ముంబయికి వెళ్లారు. ఎంతో శ్రమించి సొంతంగా కంపెనీని స్థాపించారు. మొదట ప్రారంభించిన తొమ్మిది వెంచర్‌లు విఫలమయ్యాయి. అయినప్పటికీ  పట్టువదల్లేదు. పదో ప్రయత్నంగా కేబుల్‌ ఉత్పత్తిని మొదలు పెట్టారు. తర్వాత దాన్ని రాగి, అల్యూమినియం తయారీకి విస్తరించారు. అలా చివరకు వేదాంతని స్థాపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని