Vedantu: ఇక ఆఫ్‌లైన్‌లోనూ పాఠాలు.. తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ‘వేదాంతు’

ఆన్‌లైన్ ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫాం ‘వేదాంతు(Vedantu)’ సైతం ఆఫ్‌లైన్‌ ట్యూషన్ల బాట పట్టింది. బైజూస్‌, అన్‌అకాడమీ, ఫిజిక్స్‌వాలా తదితర సంస్థల మాదిరిగా ప్రత్యక్ష శిక్షణా తరగతులకు శ్రీకారం చుట్టింది...

Published : 30 Jun 2022 19:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫాం ‘వేదాంతు(Vedantu)’ సైతం ఆఫ్‌లైన్‌ ట్యూషన్ల బాట పట్టింది. బైజూస్‌, అన్‌అకాడమీ, ఫిజిక్స్‌వాలా తదితర సంస్థల మాదిరిగా ప్రత్యక్ష శిక్షణా తరగతులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వేదాంతు లెర్నింగ్‌ సెంటర్‌’ పేరిట బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో తొలి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ కేంద్రంలో 11వ తరగతి విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ(IIT JEE), నీట్(NEET) ప్రిపరేషన్ కోర్సులను, డ్రాపర్ బ్యాచ్ కోసం ఏడాది వ్యవధిగల కోర్సును అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

‘జేఈఈ, నీట్‌ తదితర పరీక్షలు క్లిష్టమైనవి! ఈ క్రమంలోనే ఏళ్లుగా అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి.. ఈ పోటీ పరీక్షలకు అంకితభావ పర్యవేక్షణ, వ్యక్తిగత శ్రద్ధ అవసరమని అర్థం చేసుకున్నాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రస్తుత హైబ్రిడ్ మోడల్.. టైర్- 3, టైర్‌- 4 నగరాల్లోని విద్యార్థులకు పైన పేర్కొన్న సేవలను సులభతరం చేస్తుంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందించేందుకే దీన్ని ప్రవేశపెట్టాం. సంస్థ హైబ్రిడ్ లెర్నింగ్ కేంద్రాలు.. దేశవ్యాప్త అగ్రశ్రేణి ఉపాధ్యాయుల పాఠాలను చేరువ చేస్తాయి’ అని వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈవో వంశీ కృష్ణ వెల్లడించారు.

ఆఫ్‌లైన్ తరగతి గదుల్లో అత్యాధునిక బోధనా వసతులు కల్పించినట్లు సంస్థ తెలిపింది. ‘3-డీ కంటెంట్ వంటి హైటెక్ ఇంటరాక్టివ్ అప్లికేషన్‌లను అందిస్తాం. దీంతో విద్యార్థులు తమ సందేహాలను ప్రత్యక్షంగా నివృతి చేసుకోగలరు. ఇంటరాక్టివ్ క్విజ్‌లనూ నిర్వహిస్తాం. సంస్థ మాస్టర్ టీచర్స్ ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌ వేదికగా బోధిస్తారు. విద్యార్థులను సమన్వయం చేయడానికి, వారి పురోగతిని పర్యవేక్షించడానికి క్లాస్‌ టీచర్‌ ఉంటారు. విద్యార్థులను ప్రతి తరగతికి 25 మంది చొప్పున బ్యాచ్‌గా విభజిస్తాం. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత వైఫై, 4జీ ఎనేబుల్డ్ టాబ్లెట్ అందిస్తాం. 1,500కుపైగా స్మార్ట్ పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి’ అని సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని