Vehicle Retail Sales: వాహన రిటైల్‌ విక్రయాల్లో 10% వృద్ధి

Vehicle Retail Sales: వాహన రిటైల్‌ విక్రయాలు మే నెలలో పుంజుకున్నాయి. దాదాపు అన్ని విభాగాల్లో విక్రయాలు పెరిగినట్లు ఫాడా నివేదిక తెలిపింది.

Published : 05 Jun 2023 12:06 IST

దిల్లీ: వాహన రిటైల్‌ విక్రయాలు (Vehicle retail sales) మే నెలలో వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధి చెందాయి. దాదాపు అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ద్విచక్ర వాహన అమ్మకాల్లో (Two wheeler sales) 9%, త్రిచక్ర వాహనాలు 79%, ప్రయాణికుల వాహనాలు (Passenger vehicles- PV) 4%, ట్రాక్టర్లు 10%, వాణిజ్య వాహన విక్రయాల్లో 7% వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

  • కరోనా కంటే ముందుతో పోలిస్తే మాత్రం విక్రయాలు ఇంకా రెండు శాతం పుంజుకోవాల్సి ఉంది. అత్యధికంగా ద్విచక్ర వాహన విభాగపు అమ్మకాలు కరోనా ముందుకంటే ఇంకా 8 శాతం తక్కువగా ఉన్నాయి. వాణిజ్య వాహన విక్రయాలూ 7 శాతం పుంజుకోవాల్సి ఉంది.
  • విద్యుత్తు వాహన విక్రయాలు (Electric Vehicle Sales) మే నెలలో మంచి వృద్ధిని నమోదు చేసినట్లు ఫాడా నివేదిక తెలిపింది. మొత్తం రిటైల్‌ విక్రయాల్లో ఈవీల వాటా 8 శాతమని వెల్లడించింది. మొత్తం ఈవీ విక్రయాల పెరుగుదలలో ద్విచక్ర వాహనాల వాటా 7 శాతం కాగా.. త్రిచక్ర వాహన అమ్మకాలు 56 శాతం పుంజుకున్నట్లు తెలిపింది.
  • పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో ద్విచక్ర వాహన విక్రయాల్లో మంచి వృద్ధి నమోదైనట్లు ఫాడా అభిప్రాయపడింది. జూన్‌ నుంచి ఫేమ్‌-2 సబ్సిడీ తగ్గనున్న నేపథ్యంలోనూ విక్రయాలు పుంజుకున్నాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగాయని తెలిపింది.
  • క్రితం నెల పీవీ విక్రయాల్లో తగ్గుదల నమోదైన విషయం తెలిసిందే. అయితే, కార్లు అందుబాటులోకి రావడం, పెండింగ్‌ ఆర్డర్లను కంపెనీలు అందజేయడం, కొత్త మోడళ్ల రాకతో మే నెలలో తిరిగి కార్ల విక్రయాలు పుంజుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని