ఎన్నికల తర్వాతే టెలికాం ఛార్జీల పెంపు.. అలాగైతే వొడాకు కష్టమే!

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా గడ్డు పరిస్థితుల ముంగిట నిలిచిందని దేశీయ బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది. టారిఫ్‌ పెంపు ఆలస్యం కారణంగా పరిస్థితులు మరింత తీవ్రం అవుతాయని హెచ్చరించింది.

Published : 27 Mar 2023 21:29 IST

ముంబయి: టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) పరిస్థితి గురించి దేశీయ బ్రోకరేజీ సంస్థ కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ సంస్థ తీవ్రమైన గడ్డు పరిస్థితుల ముంగిట నిలిచిందని, ఇతర టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ ఆ కంపెనీ మూసివేతకు దారితీయొచ్చని పేర్కొంది. మరోవైపు, ప్రస్తుత పోటీ వాతావరణంలో ఎన్నికల తర్వాతే టెలికాం సంస్థలు రేట్లు పెంచే అవకాశం ఉందని తెలిపింది.

దేశీయ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌ తమ 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఇంత వరకు ఈ సేవలను ప్రారంభించలేదు. మరోవైపు మిగిలిన రెండు కంపెనీలు 5జీ సేవలు ప్రారంభించినప్పటికీ.. ధరల పెంపు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాకే రేట్ల పెంపు ఉంటుందని కోటక్‌ అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం సైతం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎగువన ఉండడం మరో కారణమని తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచకపోతే వొడాఫోన్‌ ఐడియాకు పెట్టుబడులు సమకూర్చుకోవడం, 5జీ సేవలు ప్రారంభించడం కష్టతరమవుతుందని కోటక్‌ తెలిపింది. దీనివల్ల చందాదారుల సంఖ్య మరింత క్షీణించి.. నిధుల సమీకరణ ప్రణాళికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. రేట్ల పెంపు ఆలస్యం చేయడం వల్ల వొడాఫోన్‌ ఐడియా మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడింది. రాబోయే 12 నెలల్లో వొడాఫోన్‌ రూ.5,500 కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొనే అవకాశం ఉందని, రేట్ల పెంపు/నిధుల సమీకరణ ఆలస్యం అయితే సంస్థ మూసివేతకు దారితీయొచ్చని హెచ్చరించింది. ఈ పరిణామాలు క్రమంగా టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్‌ మధ్య ద్విముఖ పోటీకి దారితీస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని