Virtual Credit Card: వర్చువల్‌ క్రెడిట్ కార్డ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Virtual Credit Card: వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి తెలుసా? అసలేంటీ కార్డ్‌? అనుకూలతలు, ప్రతికూలతలు ఇవీ.. 

Published : 13 Jun 2024 12:52 IST

Virtual Credit Card | ఇంటర్నెట్‌డెస్క్‌: రోజురోజుకూ డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి. దీంతో యూపీఐ లైట్‌, ట్యాప్‌ అండ్‌ పే వంటి కొత్త తరహా పేమెంట్‌ పద్ధతులు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా పిన్‌ లేకుండానే లావాదేవీలు జరపొచ్చన్నమాట. అంతేకాదు భౌతికంగా మన వద్ద క్రెడిట్‌ కార్డు లేకుండా చెల్లింపులు జరిపే మరో సదుపాయమూ ఉంది. అదే వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ (VCC). ఇంతకీ ఏంటీ కార్డ్‌? దీంతో ప్రయోజనమేంటి?

క్రెడిట్ కార్డుకు డిజిటల్ వెర్షనే ఈ వర్చువల్ క్రెడిట్ కార్డ్. సాధారణంగా క్రెడిట్‌ కార్డులు భౌతికంగా జారీ చేస్తారు. లావాదేవీలు జరపాలంటే కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌తో ఆ సమస్య ఉండదు. మీరు కావాలనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో దీన్ని వినియోగించచొచ్చు. పేమెంట్‌ చేసే సమయంలో క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌కు బదులుగా వర్చువల్‌ కార్డ్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం దీన్ని రూపొందించారు. ఎవరైతే తమ కార్డు వివరాలు బహిర్గతం కాకూడదని అనుకుంటారో వారికి ఈ వర్చువల్ క్రెడిట్‌ కార్డులు ప్రయోజనకరం.

ఈ కార్డ్‌ పొందాలంటే సదరు బ్యాంకులో క్రెడిట్‌ కార్డ్‌ లేదా ఖాతాను కలిగి ఉండాలి. అనేక బ్యాంకులు ఈ తరహా కార్డ్‌ను ఎంపిక చేసుకొనే సదుపాయం అందిస్తున్నాయి. బ్యాంకుల వారీగా ఈ నియమాలు భిన్నంగా ఉంటాయి. బ్యాంక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ను జనరేట్‌ చేసుకోవచ్చు. సాధారణ కార్డ్‌ లానే దీనికి కూడా ప్రత్యేక కార్డ్‌ నంబర్‌, సీవీవీ, గడువు తేదీతో వస్తుంది. అయితే ఈ నంబర్లు తాత్కాలికంగా ఉపయోగపడతాయి. అంటే కార్డ్‌ వినియోగానికి పరిమిత వ్యవధి ఉన్నంత వరకే ఈ నంబర్‌ ఉపయోగపడుతుంది.  సాధారణంగా ఈ కార్డు 24 గంటల నుంచి 48 గంటల వరకు మాత్రమే వినియోగించడానికి వీలువుతుంది. 

ప్రయోజనాలు- ప్రతికూలతలు

  • అదనపు భద్రత సదుపాయంతో తీసుకొచ్చిందే ఈ వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌. ఈ కార్డ్‌ వివరాలు తాత్కాలికమైనవి కాబట్టి మోసం జరిగే ప్రమాదం తక్కువ. తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారికి ఇది ప్రయోజనకరం.
  • కార్డ్‌ను జెనరేట్‌ చేసుకొనే సమయంలోనే లావాదేవీల పరిమితిని వినియోగదారులు ఎంచుకుంటారు. ఇది ఖర్చును నియంత్రించడంలో సాయపడుతుంది.
  • ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం మాత్రమే తీసుకొచ్చిన సదుపాయం కాబట్టి ఆఫ్‌లైన్‌ చెల్లింపులకు ఉపయోగపడదు. 
  • పైగా ఈ కార్డు లావాదేవీలపై పరిమితి సమయం ఉంటుంది. కాబట్టి పదేపదే లావాదేవీలు జరపాలంటే కుదరదు. మరోసారి కార్డును జనరేట్‌ చేసుకోవాల్సిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని