Vivo ads- kohli: ప్రకటనలకు వివో బ్రేక్‌.. కోహ్లీ ముందుగానే జాగ్రత్త పడ్డాడా?

Vivo ads- kohli: టీమ్‌ ఇండియా మాజీ విరాట్‌ కోహ్లీ (Virat kohli) నటించిన ప్రకటనలను చైనా మొబైల్‌ కంపెనీ వివో నిలిపివేయాలని నిర్ణయించింది.

Updated : 18 Aug 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat kohli) నటించిన ప్రకటనలను చైనా మొబైల్‌ కంపెనీ వివో నిలిపివేయాలని నిర్ణయించింది. అటు టీవీల్లో గానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ ప్రసారం చేయకూడదని నిర్ణయించింది. అయితే, ఇది తాత్కాలికమేనని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో వివో ఓ వైపు ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తేలే వరకూ విరాట్ నటించిన యాడ్స్‌ ప్రసారం చేయకూడదని కంపెనీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

2021లో వివో ఉత్పత్తులను ప్రమోట్‌ చేసేందుకు విరాట్‌ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఈడీ దర్యాప్తు నేపథ్యంలో యాడ్స్‌లో కొద్ది రోజుల పాటు కనిపించేందుకు విరాట్‌ టీమే విముఖత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు జరుగుతున్న వేళ వివో ప్రకటనల్లో కనిపిస్తే విరాట్‌పై విమర్శలు వస్తాయని భావిస్తున్నట్లు విరాట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయని ఎకనమిక్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. 

ఇటీవల కాలంలో ప్రకటనల పట్ల సెలబ్రిటీలు కాస్త అప్రమత్తంగా ఉంటున్నారనేది తాజా ఉదంతం ద్వారా మరోసారి తేటతెల్లం అయ్యింది.  పాన్‌ మసాలా ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం  వ్యక్తం చేయడంతో ఆ మధ్య ఓ బాలీవుడ్‌ హీరో బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకున్నాడు. ప్రస్తుతం మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివోను ప్రమోట్‌ చేస్తూ ప్రకటనల్లో నటిస్తే ఎక్కడ ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుందోనని ముందుగానే విరాట్‌ జాగ్రత్త పడినట్లు దీనిబట్టి తెలుస్తోంది. అటు చైనాతో ఘర్షణ సమయంలో ఐపీఎల్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన వివో సైతం ఓ ఏడాది తప్పుకోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని