Vodafone Idea: చైనా కంపెనీ జెడ్‌టీఈకి వొడాఫోన్‌ ఐడియా రూ.200 కోట్ల ఆర్డరు!

కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత 5జీ టెలికాం గేర్లకు సంబంధించి చైనా కంపెనీలకు ఎలాంటి ఆర్డర్లు వెళ్లలేదు. కానీ, తాజాగా వొడాఫోన్‌ ఐడియా.. జెడ్‌టీఈకి ఆర్డర్‌ ఇవ్వడంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.

Published : 16 Apr 2023 18:13 IST

దిల్లీ: టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea- VI) చైనాకు చెందిన కంపెనీ జెడ్‌టీఈకి రూ.200 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం. గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ఎక్విప్‌మెంట్‌ను వీఐ.. జెడ్‌టీఈ నుంచి సమకూర్చుకోనుందని సమాచారం. 

జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌ (NSCS)కు ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విశ్వసనీయ కంపెనీల నుంచి మాత్రమే టెలికాం ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుకోవాలని 2020లో జాతీయ భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. దేశీయ టెలికాం నెట్‌వర్క్‌లో వాడే పరికరాలు, వాటిని ఎక్కడి నుంచి కొనాలో ప్రభుత్వమే ప్రకటిస్తుంది. ఈ జాబితాను డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది.

అయితే, ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాక ముందే ఏర్పాటు చేసిన పరికరాలకు మాత్రం నిబంధనలు వర్తించవు. వాటి వార్షిక నిర్వహణ, సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత 5జీ టెలికాం గేర్లకు సంబంధించి చైనా కంపెనీలకు ఎలాంటి ఆర్డర్లు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జెడ్‌టీఈకి వొడాఫోన్‌ ఐడియా ఇచ్చిన ఆర్డర్‌పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వీఐ నిర్ణయాన్ని పరిశీలించే యోచనలో ఎన్ఎస్‌సీఎస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని