Vodafone idea: ₹14,500 కోట్ల నిధుల సమీకరణకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు ఓకే

Vodafone idea: భారీగా నిధుల సమీకరించాలన్న ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) ప్రణాళిక విషయంలో ముందడుగు పడింది. మొత్తం రూ.14,500 కోట్లు సమీకరించేందుకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు (VI) ఆమోదం తెలిపింది.

Published : 03 Mar 2022 21:23 IST

దిల్లీ: భారీగా నిధులను సమీకరించాలన్న ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) ప్రణాళిక విషయంలో ముందడుగు పడింది. మొత్తం రూ.14,500 కోట్లు సమీకరించేందుకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు (VI) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ గురువారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇందులో రూ.4,500 కోట్లను ప్రమోటర్‌ సంస్థలనుంచి సేకరించనున్నారు.

ఒక్కో షేరును రూ.13.30 ఇష్యూ ప్రైస్‌ వద్ద 10 రూపాయల ముఖ విలువ కలిగిన 338.3 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సంస్థలకు విక్రయించనున్నారు. యూరో సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, ప్రైమ్‌ మెటల్‌ లిమిటెడ్‌ (వొడాఫోన్‌ గ్రూప్‌కు చెందిన సంస్థలు), ఒరియానా ఇన్వెస్ట్‌మెంట్‌ పీటీఈ లిమిటెడ్‌ (ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ)కు ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌పై ఈ షేర్లు కేటాయించనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీని ద్వారా రూ.4,500 కోట్లు సేకరించనున్నారు.

ఇక ఈక్విటీ షేర్ల విక్రయం  లేదా గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (GDR), అమెరికన్‌ డిపాజిటరీ (ADR), ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌ (FCCB) వంటి రుణ సాధనాల ద్వారా రూ.10వేల కోట్లు నిధులు సమీకరించనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. దీంతో పాటు మార్చి 26న బోర్డు అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఆ కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని