Vodafine Idea: ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలపై వొడాఫోన్ ఐడియా అభ్యంతరం!
దేశవ్యాప్తంగా జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel)లు అందిస్తున్న 5జీ (5G) సేవలపై వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ట్రాయ్ (TRAI)కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రెండు సంస్థలకు ట్రాయ్ నోటీసులు జారీ చేసింది. వీటిపై ఎయిర్‌టెల్, జియో స్పందించాయి.
దిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel) ఉచితంగా 5జీ సేవలు (5G) అందివ్వడంపై మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్, జియోపై ఫిర్యాదు చేస్తూ టెలికాం నియంత్రణ సంస్థకు (TRAI) వొడాఫోన్ ఐడియా లేఖ రాసింది. దీంతో ఎయిర్‌టెల్, జియోకు ట్రాయ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రెండు సంస్థలు తమ వాదనను తెలియజేశాయి. ఇందులో తాము అందించే 5జీ సేవలు ఉచితం కాదని జియో, ఎయిర్‌టెల్‌లు చెప్పినట్లు ట్రాయ్ పేర్కొంది. కొన్ని ఎంపిక చేసిన 4జీ ప్లాన్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్లకు మాత్రమే వాటిని ఇస్తున్నట్లు చెప్పాయని తెలిపింది.
దేశంలో 5జీ సర్వీస్‌లను పరిచయం చేసే సమయంలో ‘ఎయిర్‌టెల్ 5జీ ప్లస్’ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. 5జీ ఫోన్ ఉపయోగిస్తున్న పోస్ట్‌పెయిడ్, ₹ 239 కంటే ఎక్కువ మొత్తానికి రీఛార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ యూజర్లు ఎయిర్‌టెల్ 5జీ సేవలను పొందవచ్చని ప్రకటించింది. అయితే, తాము ఆశించినట్లుగా వినియోగదారులు 5జీ సేవలను ఉపయోగించుకోవడంలేదని రెండు సంస్థలు పేర్కొన్నట్లు ట్రాయ్ వెల్లడించింది. ‘‘వొడాఫోన్ ఐడియా ఫిర్యాదుపై జియో, ఎయిర్‌టెల్‌కు నోటీసులు జారీ చేశాం. రెండు సంస్థలు తమ వాదనను తెలియజేశాయి. వీటిపై ట్రాయ్ న్యాయ, ఆర్థిక, సాంకేతిక విభాగాల ప్రతినిధులు చర్చిస్తున్నారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రాయ్ తెలిపింది.
టెలికాం ఆపరేటర్లు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. 2016లో జియో తక్కువ ధరకే టెలికాం సేవలు అందివ్వడంపై ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. కొద్దిరోజులు క్రితం జియో టీవీలో ఐపీఎల్ ప్రసారం చేయడాన్ని ఉద్దేశించి ఎయిర్‌టెల్ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై జియో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే ఎయిర్‌టెల్ ఈ ఫిర్యాదు చేసిందని ట్రాయ్‌కు రాసిన లేఖలో జియో పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను అందిస్తుండగా, వొడాఫోన్ ఐడియా మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ సేవలను అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.